అమరావతి రైతుల విషయంలో ఇంత వరకూ అంటీ ముట్టనట్లుగా వ్యవహరించిన భారతీయ జనతా పార్టీ అమిత్ షా చెప్పిన తర్వాత పూర్తి స్థాయిలో రంగంలోకి దిగారు. ఆదివారం ఆ పార్టీ ముఖ్య నేతలందరూ పాదయాత్రకు హాజరయ్యారు. సంఘిభావం తెలియచేశారు. మూడు రాజధానుల ముచ్చటే ఉండదని.. ఏకైక రాజధానిగా అమరావతి మాత్రమే ఉంటుందని తేల్చి చెప్పారు. వారి మద్దతు రైతులని సంతోషపెట్టింది. మిగతా వారి మద్దతు సంగతేమో కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ మద్దతు ఇవ్వడం వారిలో కొత్త నైతిక బలాన్ని నింపుతోంది.
ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాకుండా.. తెలంగాణ నుంచి బండి సంజయ్ కూడా అమరావతి రైతులకు మద్దతు తెలిపేందుకు వస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ఆయన కు పార్టీ హైకమాండ్ సూచించిందని చెబుతున్నారు. పాదయాత్ర తిరుపతికి చేరుకుకునేలోపు ఆయన పాదయాత్రలో పాల్గొనే అవకాశం ఉంది. రైతుల తదుపరి పోరాటాలకు బీజేపీ వైపు నుంచి జాతీయ స్థాయి నాయకుల్ని కూడా ఆహ్వానించే అవకాశాలు ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటి వరకూ బీజేపీ .. నోటితో మద్దతు పలుకుతూ రైతుల్ని నొసటితో వెక్కిరిస్తున్నట్లుగా వ్యవహరిస్తోంది. ఇప్పుడు మాత్రం పరిస్థితి మారిపోయింది.
అమరావతి రైతుల ఆందోళన వెనుక టీడీపీ ఉందన్న ఓ అభిప్రాయాన్ని గట్టిగా వినిపించేందుకు ఇతర పార్టీలు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా వైసీపీ నేతలు ఇదే చెబుతున్నారు. రైతుల్ని పెయిడ్ ఆర్టిస్టులని.. టీడీపీ కార్యకర్తలని మరొకటని వాదిస్తున్నారు. ఇంత కాలం బీజేపీ ప్రత్యక్షంగా పాల్గొనకపోవడం వల్ల అదే అభిప్రాయం వినిపించింది. కానీ మెల్లగా పరిస్థితి మారుతోంది. నెల్లూరు జిల్లాలోనూ అమరావతి రైతులకు విశేషమైన ఆదరణ లభించడం… ఓ కీలక మలుపుగా అభివర్ణిస్తున్నారు.