ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలలో తెదేపా, బీజేపీలి మిత్రపక్షాలుగా ఉన్నాయి. ఏపి ప్రభుత్వంలో బీజేపీ కూడా భాగస్వామిగా ఉంది. ఇంతవరకు రెండు పార్టీలు కలిసే సాగుతున్నా వచ్చే ఎన్నికలలో అవి కలిసి పోటీ చేస్తాయో లేదో వాటికీ తెలియదు. రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా ఎదగాలనే సంకల్పం ఉన్నట్లు బీజేపీ మొదటే చెప్పింది. కనుక ఏదో ఒకరోజు తెదేపాకు గుడ్ బై చెప్పేసే అవకాశం ఉన్నట్లు స్పష్టమవుతోంది.
రాష్ట్ర విభజన కారణంగా దెబ్బ తిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోలుకోవడానికి తగినన్ని నిధులు కేంద్రం ఇవ్వడం లేదని, అలాగే ప్రత్యేక హోదా, ఆర్ధిక ప్యాకేజి, రైల్వే జోన్ వంటి హామీలపై మాట తప్పినందుకు రాష్ట్ర ప్రజలు మోడీ ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నారనే సంగతి రాష్ట్ర బీజేపీ కూడా గ్రహించినట్లే ఉంది. అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తెదేపా కూడా సమస్య ఎదురయినప్పుడల్లా అదే సాకులు చెపుతోంది. తెదేపా మిత్రపక్షమవడంతో ఆ పార్టీని ఏమనలేక, అటు అసంతృప్తితో ఉన్న ప్రజలకు సంజాయిషీలు చెప్పుకోలేక తుండటంతో రాష్ట్ర బీజేపీ నేతలు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.
పరిస్థితి ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించడం మాటెలా ఉన్నా పార్టీ పట్ల ప్రజలలో ఆగ్రహం ఇంకా పెరిగితే దాని వలన పూర్తిగా నష్టపోవలసి వస్తుందని బీజేపీ గ్రహించినట్లే ఉంది. బహుశః అందుకే బీజేపీ రాష్ట్రంలో వరుసగా బహిరంగ సభలు నిర్వహించి, రాష్ట్రాభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల కోసం ఇంతవరకు కేంద్రం ఏమేమీ ఇచ్చిందో, రాష్ట్ర ప్రభుత్వానికి ఏవిధంగా సహాయసహకారాలు అందిస్తోందో ప్రజలకు తెలిజెప్పాలనుకొంటోంది. మార్చి ఆరున రాజమండ్రిలో, ఆ తరువాత ఉత్తరాంధ్ర, రాయలసీమలో బారీ బహిరంగ సభలు నిర్వహించడానికి రాష్ట్ర బీజేపీ నేతలు సమాయత్తం అవుతున్నారు. ఈ సభలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో సహా అనేకమంది కేంద్ర మంత్రులు కూడా హాజరవుతారు.
ఒక రాజకీయ పార్టీగా బీజేపీ ప్రజలకు చేరువవ్వాలని ప్రయత్నించడం చాలా సాధారణమయిన విషయమే. మోడీ ప్రభుత్వం రాష్ట్రానికి చాలా సహాయ సహకారాలు అందిస్తున్న మాట నిజమే. అయినా బీజేపీ పట్ల ప్రజలలో అసంతృప్తి నెలకొని ఉంది. కారణాలు ముందే చెప్పుకొన్నాము. ప్రత్యేక హోదా తదితర హామీలను నిలబెట్టుకోవడంలో సమస్యలు ఉండవచ్చును కానీ మిగిలిన రాష్ట్రాలకు బారీ ఆర్ధిక ప్యాకేజీలు ఇవ్వగలుగుతున్నప్పుడు విభజనతో దెబ్బ తిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వడానికి మోడీ ప్రభుత్వం ఎందుకు వెనకాడుతోందని రాష్ట్ర ప్రజల ప్రశ్న.
జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో పిడిపితో కలిసి అధికారంలో కొనసాగేందుకు రూ.80,000 కోట్లు (కప్పం) చెల్లించినపుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భాగస్వామిగా కొనసాగుతున్నప్పుడు నిధులు మంజూరు చేయడానికి మోడీ ప్రభుత్వం రెండేళ్ళు కావస్తున్నా ఇంకా ఎందుకు వెనకాడుతోంది? ఇంకా ఎప్పుడు ఆర్ధిక ప్యాకేజి ఇస్తుంది? అసలు ఇవ్వాలనుకొంటోందా లేదా? అని రాష్ట్ర ప్రజల సందేహపడుతున్నారు. ఇవ్వన్నీ బీజేపీకి, మోడీ ప్రభుత్వానికి కూడా చాలా బాగా తెలుసు. కానీ ఇంతవరకు వాటికి నేరుగా సమాధానాలు చెప్పాలని ప్రయత్నించలేదు. దానివలన ఆ పార్టీకే ఎక్కువగా నష్టం జరుగుతుందని కూడా వారికి తెలుసు. కనుక ఈ బహిరంగ సభలలో ఈ ప్రశ్నలకు బీజేపీ నేతలు సంతృప్తికరమయిన సమాధానాలు చెపుతారని ఆశిద్దాం.
ప్రజలు అసంతృప్తికి కారణాలు తెలిసి ఉన్నప్పుడు దానికి సంజాయిషీలు చెప్పుకోవడం లేదా వారిని మభ్యపెట్టే ప్రయత్నాలు చేయడం కంటే వాటిని పరిష్కరించేందుకు నిజాయితీగా పనిచేస్తే ఏ పార్టీకయినా మేలు కలుగుతుందని బీజేపీ నేతలు గ్రహిస్తే మంచిది.