లేని రాజధాని సమస్యను సృష్టించిన జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఎటు వెళ్లాలో తెలియని పరస్థితి ఏర్పడింది. అనేక మంది అనేక రకాలుగా సలహాలు ఇస్తున్నారు. రాయలసీమ ఉద్యమకారుడు… ఎంపీ టీజీ వెంకటేష్ సీఎం జగన్ కొత్త ఫార్ములా పంపారు. దాని ప్రకారం అమరావతిలో సెక్రటేరియట్ ఉంచాలి… కర్నూలులో మినీ సెక్రటేరియట్ పెట్టాలని అంటున్నారు. అలా అయితేనే సమస్య పరిష్కారం అవుతుందని లేకపోతే రావణకాష్టం అవుతుందంటున్నారు. ఈ ఫార్ములాకు అంగీకిస్తే బీజేపీని తాను ఒప్పిస్తానని ఆయన అంటున్నారు.
అశోకుడి పాలనలో కర్నూలు జిల్లాలోని జొన్నగిరి రాజధానిగా ఉండేదని.. తర్వాత కూడా ఏపీ ఏర్పడినప్పుడు కర్నూలు రాజధానిగా ఉందన్నారు. తమ ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేయాలని శ్రీ కృష్ణ కమిటీకి తెలియజేశామని గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల కర్నూలుకు తీవ్ర అన్యాయం జరిగే పరిస్థితి ఉందన్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ను వెంటనే ఏర్పాటు చేయాలని.. తర్వాత హైకోర్టు కోసం ప్రయత్నం చేయాలన్నారు. లేకపోతే రెండూ పోతాయని టీజీ హెచ్చరించారు.
విశాఖలో సెక్రటేరియట్ పెడితే తమ ప్రాంతానికి దూరం అవుతుందని, కాబట్టి కర్నూలులో కూడా మినీ సచివాలయం ఏర్పాటు చేయాలని ఎంపీ సూచించారు. అమరావతి కోసం రైతులు, భూములు పోగొట్టుకున్న వారికి న్యాయం చేయాలన్నారు. ఒక వేళ ఏపీ ప్రభుత్వం మళ్లీ చట్టం చేస్తే కోర్టుకు వెళతారని దాని వల్ల ప్రయోజనం ఉండదన్నారు. అమరావతినే క్యాపిటల్‌గా ఉంచాలి. పేరు ఏదైనా పెట్టుకొండి.. కానీ అభివృద్ధి మాత్రం చేయమని సూచించారు. రాజధానిని ముక్కలు చేయకుండా ఒక చోట సెక్రటేరియట్, మరోచోట శీతాకాల సమావేశాలు, ఇంకోచోట వేసవికాల సమావేశాలు నిర్వహిస్తే సమస్య పరిష్కారం అవుతుందని పరిష్కారం చూపించారు. కర్నూలు నుంచే ఇలాంటి ప్రతిపాదన రావడంపై సీఎం జగన్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది.