తెలంగాణలో టీఆర్ఎస్ పట్టు జారిపోతోంది. పార్టీపై హైకమాండ్ పట్టు సడలుతోంది. దానికి సాక్ష్యంగా స్థానిక కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లు కనిపిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు స్వతంత్ర అభ్యర్థులు పోటా పోటీగా నామినేషన్లు వేశారు. నిజానికి టీఆర్ఎస్కు 12 స్థానాల్లోనూ స్పష్టమైన మెజార్టీ ఉంది. కానీ ఆ పార్టీ నుంచే రెబల్స్ రంగంలోకి దిగారు. మామూలుగా అయితే ఏకగ్రీవం చేసుకోవాల్సిన ఎన్నికలు. కానీ 12 స్థానాలకు ఏకంగా 94 మంది నామినేషన్ వేశారు. వీరిలో 77 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు. అంతా టీఆర్ఎస్కు చెందిన వారే.
టీఆర్ఎస్ అధినేత ఖరారు చేసిన అభ్యర్థులపై క్యాడర్లో అసంతృప్తి నెలకొంది. ఆదిలాబాద్, వరంగల్ , నల్లగొండ, ఖమ్మం, కరీంనగర్ వంటి చోట్ల టీఆర్ఎస్ నేతలు నామినేషన్లు వేశారు. కొంత మంది అభ్యర్థులపై వ్యతిరేకత.. మరికొంత మంది ప్రభుత్వం నుంచి సమస్యల పరిష్కారం కారణాలుగా చూపిస్తున్నారు. కరీంనగర్లో మాజీ మేయర్ రవీందర్ సింగ్ బరిలో నిలవడం టీఆర్ఎస్ నేతల్ని కూడా ఆశ్చర్య పరుస్తోంది. వీరందరికి నచ్చే చెప్పేందుకు ముఖ్య నేతలు ప్రయత్నిస్తున్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థులపై ఒత్తిడి తెచ్చి ఏకగ్రీవం అయ్యేలా చూసేందుకు అధికారపార్టీ నేతలు సర్వశక్తులు ఒడ్డుతున్నారు.
బీజేపీ పోటీకి దూరంగా ఉండగా, కాంగ్రెస్ రెండు జిల్లాల్లో మాత్రమే పోటీ చేస్తుంది. అధికార పార్టీ 12 స్థానాలకు గాను పన్నెండింటిలో బరిలో నిలిచింది. దీంతో స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేసి బరిలో నిలుస్తామని స్పష్టం చేస్తుండటంతో ఎన్నికలు జరగడం ఖాయంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నిలబడుతున్న రెండు చోట్ల కాకుండా… ఇతర చోట్ల ఏకగ్రీవం చేసుకోకపోతే.. టీఆర్ఎస్ పార్టీ వ్యూహాల్లోనూ విఫలమైనట్లే అనుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.