టాలీవుడ్ పరిశ్రమపై ఏపీ ప్రభుత్వం చావు దెబ్బ కొట్టేసింది. కొత్తగా తీసుకొచ్చిన చట్టాన్ని ఆమోదించింది. ఆ చట్టం ప్రకారం ఇక ఏపీలో ఎలాంటి సినిమాలు నాలుగు షోలు మాత్రమే వేస్తారు. బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఉండదు. మల్టిప్లెక్స్‌లలోనూ నాలుగు షోలే వేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆరేడు షోలు వేస్తూ ప్రజల్ని దోపిడి చేస్తున్నారని మంత్రి పేర్ని అసెంబ్లీలో సినిమా పరిశ్రమపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఏం చేసినా ఎవరూ ఏమీ అనరు అనే ఉద్దేశంలో సినిమా వాళ్లున్నారని పేర్ని నాని విమర్శించారు.
పేద, మధ్య తరగతి ప్రజలకు వినోదం సినిమా కాబట్టి.. వారి బలహీనతలు సొమ్ము చేసుకోకుండా ప్రభుత్వం కాపాడుతుందన్నారు. ఆన్ లైన్ టిక్కెట్ విధానం వల్ల మాత్రమే ఇది సాధ్యమని..స్పష్టం చేశారు. ప్రస్తుతం సినిమాల వసూళ్లు, జీఎస్టీని పోల్చి చూసుకుంటే పొంతనే లేదన్నారు. అయితే తమ బిల్లుపై కొన్ని మీడియా సంస్థలు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. బిల్లు ఆమోదం పొందడంతో భారీ బడ్జెట్ సినిమాలకు ఏపీలో గడ్డు పరిస్థితులు ఎదురు కానున్నాయి.
పెద్ద హీరోల సినిమాల బడ్జెట్ల లెక్కలోకి తీసుకుంటే.. తొలి వారం…రెండు వారాల్లోనే అత్యధిక షోలు వేసుకుని .. టిక్కెట్ రేట్లు పెంచుకుని కలెక్షన్లు రాబట్టుకోవాల్సి ఉంటుంది. రేట్లను కూడా ఇప్పటికే తగ్గించి ప్రకటించింది. దీంతో ఇక ఏపీలో పెద్ద సినిమాలు విడుదలైనా నిర్మాతలకు మిగిలిదేమీ ఉండదు. ధియేటర్లకూ నష్టమే. ఇప్పుడు టాలీవుడ్ ఏం చేస్తుందనేది ఆసక్తికరం.