ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన “ఏపీ సినిమా (నియంత్రణ), సవరణ బిల్లు -2021” బిల్లు ప్రభావం సినిమా పరిశ్రమపై తీవ్రంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటి వరకూ ప్రభుత్వం ఆన్ లైన్లో టిక్కెట్ల అమ్ముతుందట అనే అంశంపైనే చర్చలు జరిగాయి. కానీ కొత్త చట్టంలో అనేక నిబంధనలు ఉన్నాయి. అందులో ప్రధానమైనది నాలుగు షోలకు మాత్రమే అనుమతి. బెనిఫిట్ షోలను రద్దు చేయడం. పరిమితంగా టిక్కెట్ రేట్లు వంటివి ఉన్నాయి.
ఏప్రిల్‌లో ఏపీ ప్రభుత్వం సినిమా ధియేటర్లలో టిక్కెట్ రేట్లు ఎంతెంత ఉండాలో డిసైడ్ చేస్తూ జీవో జారీ చేసేసింది. ఈ జీవో ప్రకారం.. కార్పొరేషన్ ప్రాంతాల్లో మల్టిప్లెక్స్ లలో ప్రీమియం సీట్ల టిక్కెట్ రేట్లు రూ. 250 మాత్రమే ఉండాలి. మిగతా టిక్కెట్లు రూ. 150, 100 ఉండాలి. సింగిల్ ధియేటర్లు ఏసీ సౌకర్యం ఉంటే అత్యధిక రేటు రూ. 100 మాత్రమే. ఏసీ లేకపోతే.. అత్యధిక టిక్కెట్ ధర రూ. 60 . ఈ టిక్కెట్ రేట్లు జనాభా స్థాయిని బట్టి పట్టణాల్లో మారుతూ ఉంటాయి. పంచాయతీల్లో ఉన్న ధియేటర్లలో మరింత తక్కువ. ఈ రేట్లన్నీ పదేళ్ల కిందటివి. ప్రస్తుతం పెరిగిపోయిన ఖర్చులు, సిబ్బంది జీతాలు, నిర్వహణ కారణంగా ఈ టిక్కెట్ రేట్లతో సినిమాలు ప్రదర్శిస్తే ధియేటర్ నిర్వహణకే సరిపోవనేది నిర్మాతల అభిప్రాయం.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టం వల్ల పెద్ద హీరోలు, పెద్ద బడ్జెట్ సినిమాలకు గడ్డు పరిస్థితి ఏర్పడుతుంది. వారి సినిమాలకు మాత్రమే బెనిఫిట్ షోలు ఉంటాయి. టిక్కెట్ రేట్లను పెంచాల్సిన అవసరం ఉంటుంది. అదనపు షోలు కూడా వారి సినిమాలకే అవసరం అవుతాయి. చిన్న సినిమాలు విడుదలైనా.. ఓ ఐదు లేదా పది కోట్ల రేంజ్‌కు చేరుకొంటే సూపర్ హిట్. ప్రస్తుతం ఉన్న డిజిటల్ యుగంలో సినిమా ధియేటర్లకు వచ్చి చిన్న సినిమాలను చూసే వారు తగ్గిపోయారు. సినిమా బాగుందని బాగా ప్రచారం జరిగితేనే వస్తున్నారు. హీరోల ఫ్యాన్స్ మాత్రమే ఖర్చు పెట్టుకుని చూస్తున్నారు.
సినిమా అనేది పూర్తిగా ప్రైవేటు వ్యాపారం. ధర ఎంత ఉండాలి అనేది నిర్ణయించుకునే హక్కు తయారీదారునికి ఉంటుంది. ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమా నిర్మాత న్యాయపోరాటం చేస్తారని.. టిక్కెట్ రేట్లను పెంచుకునేందుకు కోర్టుకెళ్తారన్న ప్రచారం జరిగింది.కానీ దాన్ని ఆయన ఖండించారు. కోర్టుకెళ్లం కానీ.. ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతామన్నారు. అయితే ఇప్పుడు ఎలాంటి సంప్రదింపులకు చాన్స్ లేకుండా చట్టం చేసేశారు. ఇప్పుడు న్యాయపోరాటం చేయకుండా ఉంటారా.. అదే రేట్లకు.. అదే నాలుగు షోలతో రిలీజ్ చేస్తారా అన్నది అర్థం కాని విషయం. ఒక వేళ న్యాయపోరాటానికి దిగితే ప్రభుత్వం .. న్యాయస్థానానికి చాలా అంశాల్లో క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ దిశగా టాలీవుడ్ అడుగులు వేస్తే ప్రభుత్వానికే ఇబ్బందికరం.