ఢిల్లీలో బియ్యం కొనుగోళ్లపై తాడో పేడో తేల్చుకుంటానని వెళ్లిన కేసీఆర్ ఏమీ తేల్చుకోకుండానే వెనక్కి వచ్చేశారు. కేసీఆర్ ఢిల్లీ వెళ్లి నాలుగు రోజులు ఉన్నారు. ఆయన ఇంత వరకూ ఏ ఒక్క కేంద్రమంత్రితోనూ సమావేశం కాలేదు. ఆయన ఆపాయింట్మెంట్ల కోసం ప్రయత్నిస్తున్నారని కానీ ఎవరూ ఇవ్వడం లేదని.. తెలంగాణను బీజేపీ కేంద్రమంత్రులు అవమానిస్తున్నారని.. తెలంగాణలో ఎర్రబెల్లి దయాకర్ రావు వంటి మంత్రులు ప్రకటించారు. అయితే కేసీఆర్తో పాటు వెళ్లిన కొంత మంది మంత్రులు, అధికారులు సమావేశమయ్యారు. నిజంగా కేసీఆర్ అపాయింట్మెంట్ల కోసం ప్రయత్నిస్తున్నారా లేక ఊరకనే తెర వెనుక వ్యవహారాలు చక్క బెట్టుకున్నారా అన్నది చర్చనీయాంశంగా మారింది.
ఎందుకంటే మమతా బెనర్జీ ఢిల్లీకి వచ్చి నరేంద్రమోడీతో సమావేశం అయ్యారు. మమతా బెనర్జీకి అడగగానే సమయం ఇచ్చి కేసీఆర్ను మాత్రం దూరం పెట్టే అవకాశాలు లేవు. ఎందుకంటే గతంలో కేసీఆర్ రాజకీయంతా అత్యంత క్లిష్టమైన సమయాల్లోనూ మోడీ, షా అపాయింట్ మెంట్లు తీసుకున్నారు. తెలంగాణలో బీజేపీకి ఇబ్బందికరం అవుతుందని తెలిసినా కేసీఆర్ అడిగారని మోడీ,షా అపాయింట్ మెంట్లు ఇచ్చారు. అలాంటిది ఇప్పుడు ఎలాంటి రాజకీయ క్లిష్ట పరిస్థితి లేనప్పటికీ అపాయింట్మెంట్లు ఇవ్వకుండా ఉండటానికి అవకాశం లేదు.
ఢిల్లీ పర్యటన ఉద్దేశం … ఉప్పుడు బియ్యం.. సన్నబియ్యం కొనుగోలు అంశం కాదని.. కేసీఆర్ ఇంకేదో రాజకీయం చేశారని కొంత మంది అనుమానిస్తున్నారు. రేవంత్ రెడ్డి వంటి వారు ఇవే ఆరోపణలు చేస్తున్నారు. కేసీఆర్ ఢిల్లీకి వెళ్లడానికి ముందు ఆయన సతీమణి వైద్య పరీక్షల కోసం ఢిల్లీ వెళ్లారు. బహుశా.. ఆమె వైద్యం విషయాలు దగ్గరుండి చూసుకుంటున్నారేమోనని కొంత మంది అంచనా వేస్తున్నారు. అయితే కేసీఆర్ ప్రకటించిన దానికి.. ఢిల్లీ వెళ్లి చేసిన దానికి పొంతన లేకపోవడంతోనే విమర్శలు వస్తున్నాయి.