కాకినాడ 3వ అదనపు జిల్లా జడ్జిగా పని చేస్తున్న మనోహర్ రెడ్డిని హైకోర్టు సస్పెండ్ చేసింది. ఆయన జడ్జి పోస్టులో ఇంకా కూర్చోవడం కొనసాగడం న్యాయవ్యవస్థ ప్రయోజనాలకు హానికరమని హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇంతకీ సస్పెండైన జడ్జి మనోహర్ రెడ్డి ఏం చేశారంటే “తమ” ప్రభుత్వం వచ్చిందని.. పదవి ఇచ్చిందని ఏది అడిగితే అది చేసేశారు. ఫలితంగా ఆయన న్యాయమూర్తిగా విశ్వాసాన్ని కోల్పోవడమే కాదు.. అవినీతి చేసి ఆధారాలతో సహా దొరికిపోయారు.
మనోహర్ రెడ్డిని జగన్ మోహన్ రెడ్డి సీఎం గానే ఏపీ న్యాయశాఖ కార్యదర్శిగా నియమించారు. ఆయన హయాంలో అనేకమంది స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించారు. కానీ ఆ నియామకాలన్నీ అవినీతితో జరిగాయని ఆరోపణలు వచ్చాయి. అర్హతలు, సమర్థతతో సంబంధంలేకుండా, అధికారపార్టీ పెద్దల సిఫారసుల మేరకే వారిని నియమించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అసోసియేషన్ నేరుగా ఆధారాలతో హైకోర్టుకు ఫిర్యాదు చేసింది. ప్రాథమిక ఆధారాలు ఉండటంతో హైకోర్టు మొదట ఆయనను న్యాయశాఖ కార్యదర్శి పదవి నుంచి తప్పించాలని ఆదేశించింది. అయితే ప్రభుత్వం మొదట ఒప్పుకోలేదు. తర్వాత తప్పలేదు. కానీ ఇప్పటికీ న్యాయశాఖ కార్యదర్శి పోస్టును భర్తీ చేయలేదు.
మనోహన్ రెడ్డిని బదిలీ చేసిన తర్వాత హైకోర్టు పూర్తి స్థాయిలో విచారణ జరిపింది. ఆయన తీవ్రమైన తప్పిదానికి పాల్పడినట్లుగా గుర్తించామని.. విశాల ప్రజాప్రయోజనాల దృష్ట్యా ఏపీ సివిల్ సర్వీసు రూల్స్-1991 ప్రకారం క్రమశిక్షణా చర్యల్లో భాగంగా మనోహర్ రెడ్డిని సస్పెండ్ చేస్తున్నామని హైకోర్టు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. నిజానికి ప్రభుత్వం విచారణ జరిపి మనోహర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి. కానీ ప్రభుత్వమే ఆయనతో ఆ తప్పులు చేయించింది కాబట్టి అలాంటి చాన్స్ లేదు. కానీ న్యాయమూర్తిగా గౌరవనీయ స్థానంలో ఉండి.. చేయకూడదని తప్పులు చేసిన మనోహర్ రెడ్డి వ్యవస్థ ముందు దోషిగా నిలబడ్డారు.