ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టం విషయంలో టాలీవుడ్ నుంచి చిరంజీవి స్పందించారు. ఆయన ఆన్లైన్లో టిక్కెట్లు ప్రభుత్వమే అమ్మడాన్ని సమర్థించారు. దాన్ని తామే అడిగామని కూడా తన ట్వీట్లో వివరించారు. అయితే ఆయన తమ కోరికను బతిమాలుకున్నట్లుగానే వెల్లడించారు. అదే సినిమా టిక్కెట్ల రేట్లు. తగ్గించిన సినిమా టిక్కెట్లను కాలానుగుణంగా పెంచాలని కోరారు. దేశమంతా ఒకటే జీఎస్టీ ప్రభుత్వాలు తీసుకుంటున్నప్పుడు.. టిక్కెట్ ధరలు కూడా అదే విధంగా ఉండటం సమంజసమన్నారు.
వివిధ రాష్ట్రాల్లో టిక్కెట్ రేట్లు ఎలా ఉన్నాయో.. ఏపీలో కూడా అంతే నిర్ణయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అదే సమంజసమన్నారు. ఈ విషయం దయచేసి పునరాలోచించాలని .. ఆ ప్రోత్సాహం ఉన్నప్పుడే తెలుగు సినీ పరిశ్రమ నిలదొక్కుకుంటందని చిరంజీవి విజ్ఞాపనా పూర్వకంగా తన ట్వీట్లో వివరించారు. ప్రభుత్వం ఆన్ లైన్ టిక్కెట్లను పూర్తిగా పన్నులు ఎగ్గొడుతున్నారన్న కోణంలో ప్రజెంట్ చేస్తూండటంతో … అది వద్దని చెప్పే సాహసం టాలీవుడ్ చేయలేకపోతోంది.
ఇప్పుడు అసలు సమస్య టిక్కెట్ రేట్లే. ఆ టిక్కెట్ రేట్లను కూడా పెంచబోమని ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటికే జీవో విడుదల చేసింది. ఆ జీవో ప్రకారం టిక్కెట్ రేట్లు అమ్మితే ధియేటర్ నిర్వహణ చార్జీలు కూడా రావని భావిస్తున్నారు. ప్రభుత్వంతో ఎన్ని సార్లు చర్చలుజరిపినా ప్రయోజనం లేకపోయింది. చివరికి నాగార్జున కూడా ఓ సారి వెళ్లి కలిసి వచ్చారు. అయినా సమస్య పరిష్కారం కాలేదు. ఇప్పుడు చిరంజీవి విజ్ఞప్తిపై ప్రభుత్వం స్పందిస్తుందో లేదో చూడాలి.