చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్ కుమార్తెపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో కొడాలి నాని, వల్లభనేని వంశీల వ్యవహారం జూనియర్ ఎన్టీఆర్ మెడకు చుట్టుకునే పరిస్థితులు కనిపించడంతో .. ఈ మిత్రులిద్దరూ జాగ్రత్త పడుతున్నట్లుగా కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ తొలి సారిగా జూనియర్ ఎన్టీఆర్ తీరుపై ప్రశ్నలు సంధించడం ప్రారంభించారు. ఆయనకు అత్యంత సన్నిహితులైన ఇద్దరు నేతలు ఎన్టీఆర్ కుమార్తెపై నీచమైన భాషను మాట్లాడితే.. కుటుంబ పరువును కాపాడటంలో జూనియర్ ఎన్టీఆర్ విఫలమయ్యారని విమర్శలు ప్రారంభించారు.
దీంతో కొడాలి నాని , వల్లభనేని వంశీ ఇద్దరూ మీడియా ముందుకు వచ్చారు. వంశీ మీడియాతో మాట్లాడలేదు కానీ.. కొడాలి నాని మాత్రం మాట్లాడాల్సినదంతా మాట్లాడి అంటే చంద్రబాబును యథావిధిగా తిట్టి.. ఎన్టీఆర్తో తమకేం సంబంధాలు లేవని ప్రకటించారు. ఒకప్పుడు సినీ పరిశ్రమలో ఉన్నప్పుడు ఎన్టీఆర్తో సంబంధాలున్నాయని.. తర్వాత చెడిపోయాయన్నారు. తమ నాయకుడు జగన్ అని.. తాము ఎన్టీఆర్ చెబితే ఎందుకు నోరు మూసుకుంటామని ప్రశ్నించారు.
ఎన్టీఆర్ను సేవ్ చేయడానికి.. ఆయనకు తమతో ఇప్పుడు సంబంధాల్లేవని చెప్పడానికి నాని, వంశీ ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. నిజానికి ఎన్టీఆర్తో సంబంధాలు చెడితే ..అందరితో పాటు ఆయననూ చెడామడా బూతులు తిట్టగల నైపుణ్యం వారికి ఉంది. కానీ ఎన్టీఆర్ గురించి పల్లెత్తు మాట అనలేదు. అయినా వీరితో ఎన్టీఆర్కు చెడితే ఘాటుగానే రెస్పాండ్ అయ్యేవారుగా అన్న సందేహం టీడీపీ శ్రేణుల నుంచి ఇప్పటికే ఉంది.