బీజేపీకి టీఆర్ఎస్ బీ టీమ్ అనేశారు ఢిల్లీ రైతు ఉద్యమ నేత రాకేశ్ టికాయత్. హైదరాబాద్లో ధాన్యం కొనుగోలు అంశం మీద రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతు పలికేందుకు వచ్చిన ఆయన .. టీఆర్ఎస్పైనా విమర్శలు చేశారు. రైతు ఉద్యమంపై టీఆర్ఎస్ వైఖరి స్పష్టంగా లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా రైతు వ్యతిరేకేనని విమర్శించారు. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం చేస్తున్న జాప్యం వల్ల.. రైతులు ఆందోళన చెందుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసే వరకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసకున్న రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు టికాయిత్. ఈ సందర్భంగా రైతు ఉద్యమం ఒక ప్రాంతానిది పేర్కొన్నారు టికాయిత్. భాషలు వేరైనా.. భావన ఒకటేనని స్పష్టం చేశారు. కేసీఆర్ ఢిల్లీ రైతు ఉద్యమంలో చనిపోయిన రైతుల కుటుంబానికి రూ. మూడు లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. టికాయత్ నేతృత్వంలోని రైతు సంఘంతో మాట్లాడి అందరికీ పంపిణీ చేస్తామన్నారు. అయితే టికాయత్ నమ్మినట్లుగా లేరు. ముందుగా తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్న రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతీ పంటకు కనీస మద్దతు ధర కల్పించేలా చట్టం తెచ్చే వరకూ పోరాడతామని టికాయత్ స్పష్టం చేశారు.
గ్రేటర్ ఎన్నికలకు ముందు సాగు చట్టాలకు వ్యతిరేకంగా మాట్లాడిన కేసీఆర్.. ఆ ఎన్నికల్లో ఫలితాలు తేడా రావడంతో మనసు మార్చుకున్నారు. తర్వాత ఢిల్లీకి వెళ్లి వచ్చి సాగు చట్టాలకు అనుకూలంగా మాట్లాడారు. మళ్లీ ఇటీవల సాగు చట్టాలపై పోరాటం చేస్తామని ప్రకటించారు. ఆ తర్వాత కేంద్రం సాగు చట్టాలను ఉపసంహరించుకుంది. వెంటనే కేసీఆర్ ఉద్యమంలో చనిపోయిన వారికి సాయం చేయాలని డిమాండ్ చేస్తూ.. తెలంగాణ సర్కార్ తరపున రూ. మూడు లక్షల చొప్పున సాయం ప్రకటించారు. కానీ దాని వల్ల ఢిల్లీ రైతులు ఆయనను నమ్మకపోగా.. తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకున్న వారికి పరిహారం ఇవ్వాలనే డిమాండ్లు మాత్రం పెరుగుతున్నాయి.