కరోనా వైరస్ మళ్లీ కలకలం రేపుతోంది. కరోనా కొత్త వేరియంట్‌పై భారత్ లో హైఅలర్ట్ ప్రకటించారు. కొత్త వైరస్‌ను దక్షిణాఫ్రికా కొత్త వేరియంట్ B.1.1.529గా గుర్తించారు. ఈ వైరస్ ప్రభావంపై స్పష్టత రావడంతో రాష్ట్రాలను కేంద్రం అలర్ట్ చేసింది. కేంద్ర ఆరోగ్యశాఖ సెక్రటరీ అన్ని రాష్ట్రాలకు లేఖలు రాశారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులను పూర్తి మూడెంచెల స్క్రీనింగ్ చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా దక్షిణాఫ్రికాతో పాటు హాంకాంగ్, బోట్స్వానాల నుంచి వచ్చే ప్రయాణికుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
“విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల శాంపిల్స్‌ని జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌లకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు పంపించాలి. కేంద్ర ఆరోగ్యశాఖ జారీ చేసిన నిబంధనల ప్రకారం విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై దృష్టిసారించాలి. వీసా పరిమితులు తగ్గించడం, అంతర్జాతీయ ప్రయాణంపై ఆంక్షలు సడలించిన నేపథ్యంలో ఈ వేరియంట్ వ్యాప్తికి అవకాశం ఉంటుంది. అందువల్ల అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.” అని కేంద్రం స్పష్టం చేసింది.
కొత్త వేరియంట్ ప్రజారోగ్యానికి సవాల్ విసిరే ప్రమాదం ఉందని వైద్య వర్గాలు అంచనా వేస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా అధిక సంఖ్యలో కొత్త వేరియంట్‌కు మ్యుటేషన్లు ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. విస్తృతంగా వ్యాప్తి చెందడం, రోగనిరోధక శక్తిని ఏమార్చడం వంటివి ఈ రకం వైరస్‌లో ఎక్కువ ఉన్నట్లుగా భావిస్తున్నారు. అప్రమత్తం కాకపోతే .. మరోసారి మూడో వేవ్ ఈ రకంతోనే వచ్చే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు.