రేటింగ్: 2.25/5
అరకొర ప్రతిభావంతులు కూడా అదృష్టం కొద్దీ… అందలం ఎక్కేస్తున్న రోజులివి. ప్రతిభ ఉన్నా సరే – ఇంకా అక్కడక్కడకే పాకులాడుతున్నారు కొంతమంది. రాజ్ తరుణ్ ప్రతిభావంతుడే. తన కెరీర్లో మంచి కథలు ఎదురొచ్చాయి. దాంతో వరుసగా హిట్లు కొట్టాడు. అయితే ఆ తరవాత అదృష్టం బాగాలేకో, లేదంటే.. కేవలం అదృష్టాన్నే నమ్ముకునో – గాడి తప్పేశాడు. చేసిందల్లా… ఫట్టే. అలాంటి దశలోనూ.. అదృష్టం వెంటే ఉంది. అన్నపూర్ఱ స్టూడియోస్ లాంటి బ్యానర్లో సినిమా చేసే ఛాన్స్ వచ్చింది. ఈసారైనా రాజ్ తరుణ్ జాతకం మారుతుందని ఆశించారంతా. మరి ఏమైంది..? ఫ్లాపుల నుంచి నేర్చుకున్న అనుభవం, అదృష్టం రెండూ ఈసారి కలిసొచ్చాయా?
రాజు (రాజ్ తరుణ్) హైదరాబాద్ లోని ఓ కంపెనీలో సెక్యురిటీ గార్డ్ గా చేరతాడు. అక్కడే సుదర్శన్ (సుదర్శన్) పరిచయం అవుతాడు. అదే కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తుంటుంది శ్రుతి (కాశిష్ ఖాన్). రాజ్ ని కూడా సాఫ్ట్ వేర్ ఇంజనీరే అనుకుంటుంది. ఇద్దరి మధ్యా పరిచయం పెరిగి, ప్రేమగా మారుతుంది. ఈలోగా రాజుని చంపడానికి గని ముఠా ఒకరి దగ్గర సుపారీ తీసుకుంటుంది. రాజుపై ఓసారి ఎటాక్ కూడా జరుగుతుంది. రాజు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కాదు, సెక్యురీటీ గార్డ్ అనే నిజం శ్రుతికి తెలుస్తుంది. అప్పుడు శ్రుతి ఏం చేసింది..? రాజుని చంపాడానికి సుపారీ ఇచ్చిందెవరు? అసలు రాజు కథేంటి? ఇదంతా… సెకండాఫ్ లో చూసి తెలుసుకోవాల్సిందే.
అనుభవించు రాజా ట్రైలర్ చూస్తే – కథేమిటన్నది ఈజీగా అర్థమైపోతుంది. దర్శకుడు ట్విస్టులు, టర్న్‌లూ అనుకుని కొన్ని రాసుకున్నాడు గానీ, అవి కూడా.. ముందే తెలిసిపోతాయి. రాజ్ తరుణ్ చిన్నప్పటి ఎపిసోడ్ నుంచి కథ మొదలవుతుంది. తాతలు, తండ్రులు బాగా సంపాదించి – వాళ్లు అనుభవించుకుండానే పోయారు కాబట్టి, రాజ్.. రాజ భోగాలు అనుభవించడానికి రెడీ అయ్యాడన్నది బ్యాక్ స్టోరీగా రాసుకున్నాడు. అయితే ఇలాంటివి చూపించినంత మాత్రన – కథకొచ్చే అదనపు ప్రయోజనం ఏమీ ఉండదు. లెంగ్త్ పెరగడం తప్ప. కట్ చేస్తే -హీరో సెక్యురిటీ గార్డ్ గా దర్శనమిస్తాడు. ఫ్లాష్ బ్యాక్ లో ఏం జరిగి ఉంటుందో ఈజీగా ఊహించేయొచ్చు. సెక్యురిటీ గార్డుగా రాజ్ తరుణ్‌తో బోలెడంత కామెడీ చేయొచ్చన్నది దర్శకుడి ఫీలింగ్ కావొచ్చు. తెరపై.. నటీనటులు నవ్వడం ఒక్కటే కామెడీ కాదని, అది చూసి జనాలు నవ్వడం కామెడీ అని దర్శకుడు గుర్తిస్తే బాగుండేది. మధ్యలో బెస్ట్ సెక్యురిటీ గార్డ్ గా.. హీరోగారికి అవార్డు ఇస్తున్నప్పుడు చూడాలి. రాజాలో.. వెంకటేష్ అంతటి పెర్ఫార్మెన్సు.. హీరోగారి నుంచి. అసలు ఊర్లో బంగారంగా.. దర్జాగా, దొరబాబుగా ఉండేవాడు, సిటీ వచ్చి సెక్యురిటీగార్డుగానే ఎందుకు పనిచేయాలి? దాని వెనుక లాజిక్కేంటి? అనేది మనం అకక్కూడదు. పోనీ.. ఊర్లో ఆస్తులన్నీ పోయాయా? బికారి అయిపోయాడా? అంటే అదీ లేదు. ఊర్లో ఆస్తులు నిక్షేపంలా ఉంటాయి.
సెకండాఫ్‌లో నైనా కాస్త కామెడీ ఆశిస్తాడు ప్రేక్షకుడు.ఎందుకంటే కథ భీమవరం షిఫ్ట్ అవుతుంది కాబట్టి. భీమవరం జనాల వెటకారం, అక్కడ కనిపించే వెరైటీ పాత్రలతో కావల్సినంత వినోదం పండించొచ్చు. కానీ.. దాన్ని కూడా దర్శకుడు సరిగా వాడుకోలేదు. ఎప్పుడైతే…బ బంగారం ప్రెసిడెంటు అవ్వాలనుకుంటాడో, అక్కడి నుంచి కథ గాడి తప్పుతుంది. `ఇక్కడ జనాలు పిచ్చ పిచ్చగా నవ్వేస్తారు` అనుకునే దర్శకుడు కామెడీ సీన్లు రాసుకుని ఉంటాడు. కానీ….అవేం వర్కవుట్ అవ్వలేదు. మర్డర్ మిస్టరీ ఉంచి, యాక్షన్ జోనర్ ని కూడా మిళితం చేయాలనుకున్నాడు. కానీ ఎమోషన్స్ ని సరిగా డీల్ చేయకపోవడం వల్ల – అదీ వృధా ప్రయత్నంగా మిగిలిపోయింది. మధ్యమధ్యలో `పండగంటే కొత్త బట్టలూ, స్వీట్లూ కాదు, మన వాళ్ల మధ్య సంతోషంగా గడపడం`, `సొంతూరు సొంతూరే` లాంటి డైలాగులు బాగున్నా, ఈ కథలో అతికించినట్టు అనిపించిచాయి.
నటుడిగా రాజ్ తరుణ్ తప్పేం చేయలేదు. తన ఎనర్జీని, కామెడీ టైమింగ్ నీ నూటికి నూరుశాతం ఆవిష్కరించే కథైతే కాదిది. కథానాయిక కనిపించినప్పుడల్లా `తనే ఈ సినిమాలో హీరోయిన్` అంటూ కింద మెన్షన్ చేయాలి. లేదంటే.. ఆమె పక్కనున్న ఫ్రెండ్ నే హీరోయిన్ అనుకుంటారు. ఎందుకంటే హీరోయిన్ కంటే ఆ ఫ్రెండ్ పాత్ర పోషించిన అమ్మాయే బాగుంది. సుదర్శన్ కాస్త నవ్వించగలిగాడు. అజయ్ కి కూడా మంచి పాత్రే పడింది. మిగిలిన పాత్రలేవీ అంతగా గుర్తుండవు.
దర్శకుడు ఓ సాదా సీదా లైన్ రాసుకున్నాడు. తను నమ్ముకున్నది కామెడీనే. కానీ అది ఈ సినిమాలో వర్కవుట్ కాలేదు. కామెడీ చేయాలంటే నటీనటులు ఉంటే సరిపోదు. వినోదం ఎంతున్నా – అది సీన్ల నుంచే బయటకు రావాలి. లేదంటే అంతా ఆర్టిఫిషియల్ గానే తయారవుతుంది. పాటల్లో `అనుభవించురాజా` హుషారుగా సాగింది. మిగిలిన పాటలేవీ గుర్తుండవు. అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ నుంచి వచ్చిన సినిమా ఇది. చిన్నదో, పెద్దదో.. ఆ సంస్థ నుంచి వస్తే – బలమైన కథ ఉంటుందని అంతా ఆశిస్తారు. కానీ.. ఈ సినిమాలో అది మిస్సయ్యింది. తొలి సగం. చాలా బోరింగ్ గా సాగితే.. సెకండాఫ్ లోనూ అదే తంతు కొనసాగింది.
ఫినిషింగ్ టచ్: ‘భరించు’ రాజా!
రేటింగ్: 2.25/5