తెలంగాణలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఖచ్చితంగా షాకిస్తామని ఈటల రాజేందర్ నమ్మకంతో ఉన్నారు. ఆయన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఓ చోట టీఆర్ఎస్ ఓడిపోబోతోందని తేల్చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండు స్థానిక సంస్థల ఎమ్మెల్సీలకు పోటీ జరుగుతోంది. రెండింటికి టీఆర్ఎస్ అభ్యర్థులుగా ఎల్.రమణ, భానుప్రసాదరావులను కేసీఆర్ ఖరారు చేశారు. వారు నామినేషన్లు వేశారు. అయితే అనూహ్యంగా ఇతరులు కూడా పోటీలో ఉన్నారు. ముఖ్యంగా కరీంనగర్ మాజీ మేయర్, కార్పొరేటర్ సర్దార్ రవీందర్ సింగ్ నామినేషన్ వేసి.. టీఆర్ఎస్కు రాజీనామా చేసేశారు.
ఈయన వెనుక ఈటల ఉన్నారనే అనుమానాలు టీఆర్ఎస్లో ఉన్నాయి. సుదీర్ఘకాలంగా టీఆర్ఎస్లో ఉన్న రవీందర్ సింగ్ ఇప్పుడు హాట్ ఫేవరేట్‌గా మారారు. టీఆర్ఎస్ అభ్యర్థుల్లో ఒకరు ఓడిపోతారన్న ప్రచారం జరుగుతూండటంతో ఓటర్లను టీఆర్ఎస్ నేతలు క్యాంపులకు తరలిస్తున్నారు. కరీంనగర్ జిల్లా మొత్తం 1324 ఓట్లు ఉన్నాయి. వీరిలో 750కి పైగా ఎంపీటీలే ఉన్నారు. మిగతా వారు మున్సిపల్ కార్పోరేటర్లు, కౌన్సిలర్లతో పాటు ఇతర సభ్యలు ఉన్నారు. వీరిలో 80 శాతానికిపైగా టీఆర్ఎస్ ఓటర్లే. కానీ ఈటల పార్టీ బయటకు వెళ్లిన తర్వాత.. సీన్ మారిపోయింది. పార్టీలో ఉంటున్నారు కానీ ఎంత మంది విధేయంగా ఉంటున్నారో అర్థం కాని పరిస్థితి.
పరిస్థితి తేడాగా ఉండటంతో స్థానిక సంస్థల ఓటర్లతో మంత్రులు కొప్పుల ఈశ్వర్ తోపాటు గంగుల కమాలాకర్ టచ్‌లో ఉంటున్నారు. క్యాంపుల్లో ఉన్న వారితో ఇతరులెవరూ టచ్‌లోకి రాకుండా చూసుకుంటున్నారు. నిజంగా ఈటల చెప్పినట్లుగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిని ఒకరిని ఓడిస్తే .. టీఆర్ఎస్ పరిస్థితి మరింతగా దిగజారిపోతుంది. ఈటల పలుకుబడి పెరిగిపోతుంది.