తెలంగాణలో ఇప్పుడు దళిత బంధు గురించి ఎక్కడా చర్చించడం లేదు. అమలు కూడా ఆగిపోయింది. హుజురాబాద్‌లో వంద శాతం అమలు చేస్తామన్నారు కానీ ఇప్పుడు అక్కడ కూడా ప్రాసెస్ ఎక్కడిదక్కడ ఆగిపోయింది. కానీ రైతు బంధును మాత్రం కాస్త ముందుగానే రైతుల ఖాతాల్లో వేయాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. డిసెంబర్ మొదటి వారంలోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని కసరత్తు ప్రారంభించింది.
తెలంగాణలో యాసంగి సీజన్పంటలు వేయడాన్ని రైతులు ప్రారంభించారు. వరిని రైతులు అతి తక్కువగా వేస్తున్నారు. ముందుగానే రైతు బంధు సాయం చేస్తామని కేసీఆర్ ఇటీవల ప్రకటించారు. దానికి తగ్గట్లుగా ఎకరానికి రూ.5 వేల చొప్పున సుమారు కోటిన్నర లక్షల ఎకరాలకు రూ.7,500 కోట్ల నిధులను పంపిణీ చేయనున్నారు. ఆర్థిక వనరులను కూడా సమీకరించుకున్నారు. ప్రతి ఏటా రెండు సార్లు రైతు బంధు ఇస్తున్నారు. గత జూన్ నెలలో ఈ వానాకాలం సీజన్‌కు సంబంధించి 60.84 లక్షల మంది రైతులకు రూ.7,360.41 కోట్లను ప్రభుత్వం పంపిణీ చేసింది.
ఇప్పుడు సుమారు కోటిన్నర లక్షల ఎకరాలకు పంపిణీ చేయడానికి రూ.7,500 కోట్లు పంపిణీ చేయనున్నారు. నిధులను సర్దుబాటు చేసుకుని.. డిసెంబరు మొదటి వారంలో రైతుబంధు ఆర్థిక సహాయం పంపిణీ ఉంటుంది. ఈ సారి ఈ పథకాన్ని సాదాసీదాగా నిర్వహించాలా లేక సభలు..సమావేశాలు పెట్టాలా అన్నదానిపై స్పష్టత లేదు. కేంద్రం ఇచ్చే కిసాన్ సమ్మాన్ నిధులు దీనికి సంబంధంలేదు. ఏపీ ప్రభుత్వం తాము అమలు చేస్తున్న రైతు భరోసా పథకంలో కేంద్ర నిధులు కలిపి చెబుతోంది కానీ తెలంగాణ సర్కార్ మాత్రం వాటిని కేంద్ర పథకంగానే ఉంచేసింది. తాము సొంతంగా అమలు చేస్తోంది.