ఏపీలో టికెట్ రేట్ల వ్యవహారం విషయంలో డి.సురేష్ బాబు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడున్న టికెట్ రేట్లు అమలైతే, కరెంటు ఛార్జీలు కూడా రావని, ఇదే పరిస్థితి కొనసాగితే, థియేటర్లు మూసుకోవాల్సివస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కొద్దిసేపటి క్రితం హైదరాబాద్లోని పాత్రికేయులతో ఆయన మాట్లాడారు.
”మార్కెట్లో ఒకొక్క వస్తువుకీ ఒక్కో రేటు ఉంటుంది. అన్ని వస్తువుల్ని కలిపి ఒకే రేటుకి అమ్మాలంటే ఎలా? సినిమా కూడా అంతే. పెద్ద సినిమాల బడ్జెట్ వేరు. చిన్న సినిమాల బడ్జెట్ వేరు. రెండు సినిమాలకూ ఒకే రేటు నిర్ణయించడం సమంజసం కాదు. ఇలాగైతే పెద్ద సినిమాలు భారీగా నష్టపోతాయి. ఏమైనా అంటే బ్లాక్ టికెట్ వ్యవస్థ అంటుంటారు. బ్లాక్ టికెట్ వ్యవస్థ.. రెండు మూడు రోజులు ఉంటుందేమో..? ఆ తరవాత.. టికెట్ మామూలు రేటుకే అమ్ముతారు. తిప్పి కొడితే.. వెయ్యి కోట్ల పరిశ్రమ కాదిది. దానిపై ఇన్ని ఆంక్షలేంటో అర్థం కావడం లేదు. టికెట్ రేటు ఇంత అని చెప్పలం.. కానీ థియేటర్లో ప్రేక్షకుడ్ని బలవంతంగా కూర్చోబెట్టలేం. టికెట్ కొనిపించలేం. ఇష్టమొచ్చినవాళ్లు చూస్తారు, లేదంటే లేదు. అది ప్రేక్షకుడి చేతుల్లో ఉంటుంది. మా సినిమా చూడమని ఎవరూ నిర్భందించలేరు కదా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ చిత్రసీమని చిన్నచూపు చూస్తున్నాయి. ఇలాగైతే.. మనుగడ సాధించడం కష్టం” అన్నారు.