తెలుగుదేశం పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల నడుమ పరస్పరం కప్పల తక్కెడ ఆట నడుస్తున్నట్లుగా కనిపిస్తోంది. తెదేపాలోకి వైకాపా ఎమ్మెల్యేలు ఫిరాయిస్తారనే పుకార్లు, నేను తలచుకుంటే ప్రభుత్వమే కూలిపోతుందని జగన్ బీరాలు పలకడం లాంటి పరిణామాల పర్యవసానాలు ఇప్పుడు ఒక రూపు తీసుకుంటున్నాయి. అన్నిటికంటె ముందుగా వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి భూమానాగిరెడ్డి అండ్ కో తెలుగుదేశంలోకి చేరిపోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
వైఎస్ రాజశేఖరరెడ్డి ఏలుబడి సాగుతూ ఉండిన రోజుల్లో అప్పటికి తెలుగుదేశంలోనే ఉన్న భూమా నాగిరెడ్డి దంపతులు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అప్పట్లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఆ తర్వాత వైఎస్ జగన్ వెంట వైకాపాలోకి వచ్చారు. జగన్తో సమీప బంధుత్వం కూడా ఉండడంతో.. అక్కడ వారి హవా బాగానే సాగింది. ఎన్నికల సమయంలో శోభానాగిరెడ్డి దుర్మరణం పాలైన సంఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది. తర్వాత ఆమె కుమార్తె అఖిలప్రియ అక్కడ ఎమ్మెల్యే అయ్యారు.
ఇదంతా గతం అయితే.. కొన్నాళ్లుగా భూమా కుటుంబం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా కనిపించడం లేదు. తాజాగా ఎవరెవరు ఏ పార్టీనుంచి ఏ పార్టీలోకి మారుతారో అని ఆరాలు తీసేలోగా.. భూమా నాగిరెడ్డి అండ్ కో తెదేపాలోకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు అదికాస్తా ఫైనల్ అయింది.
తెలుగుదేశం నుంచి స్పష్టమైన సంకేతాలు రాగానే, శనివారం నాడు తుదివిడత చర్చలు పూర్తికాగానే ఆదివారం నాడు భూమా నాగిరెడ్డి, ఆయన కూతురు ఎమ్మల్యే అఖిలప్రియ, అనుచరులైన మరో ఇద్దరు ఎమ్మెల్యేలతో కలిసి తెలుగుదేశం లో చేరుతారని వార్తలు వస్తున్నాయి. దీనికి ప్రతిగా భూమా అఖిలప్రియకు లేదా భూమా సూచించిన వారికి రాష్ట్ర సర్కారులో ఒక మంత్రి పదవి ఇవ్వడానికి చంద్రబాబు సుముఖంగానే ఉన్నారని.. దీనికి సంబంధించి తుదివిడత చర్చలు జరుగుతున్నాయని తెలుస్తున్నది. శనివారం నాడు చంద్రబాబునాయుడు కర్నూలు జిల్లా నాయకులతో సమావేశం పెట్టుకుంటున్నారు. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సహా అందరినీ అందుబాటులో ఉండాల్సిందిగా సీఎం సూచించారు. ఈ సమావేశంలోనే భూమా చేరికను గురించి ఫైనలైజ్ చేస్తారని సమాచారం. ఆ పర్వం పూర్తి కాగానే, రేపు భూమా నాగిరెడ్డి చేరిక ఉంటుందని వార్తలు వస్తున్నాయి.