ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీల్లో 90శాతం వైఎస్ఆర్సీపీవే. అందరూ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అంతో ఇంతో ఖర్చు పెట్టుకున్నారు. సర్పంచ్‌లుగా .. వార్డు సభ్యులుగా గెలిచారు. అంత ఖర్చు పెట్టుకుని గెలిచిన వారు ప్రతిఫలం ఆశిస్తారు. కానీ ఇప్పుడు అసలు ఖర్చు పెట్టుకున్న సొమ్ము కాదు కదా.. గ్రామ సమస్యలను కూడా సొంత ఖర్చుతో చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పంచాయతీల నిధులన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం ఊడ్చేసింది. నిజానికి రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు నిధులివ్వాలి. అవి ఇవ్వడం లేదు. కేంద్ర ఆర్థిక సంఘం నిధులు నేరుగా పంచాయతీలకు వస్తాయి.
ఇప్పుడు వాటన్నింటినీ ఊడ్చేసింది. దీంతో వైసీపీ క్యాడర్ అయిన సర్పంచ్‌లకు నోట మాట రావడం లేదు. ఓ వైపు పనులు చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. తాముఖర్చు పెట్టిన వాటిని వెనక్కి ఆదాయంగా తెచ్చుకోవాలనుకున్నారు. కానీ ఆ అవకాశం లేకుండా పోయింది. మరో వైపు పంచాయతీల్లో వచ్చే చిన్న చిన్న పనులను చేయించడానికి చేతి ఖర్చు పెట్టుకోవాల్సి వస్తోంది. సర్పంచ్ అనే బాధ్యత వారిని అప్పుల పాలు చేస్తోంది. ఏం చేయాలో తెలియక అల్లాడిపోతున్నారు. చాలా కొద్ది మంది మాత్రమే బయటకు వస్తున్నారు. అందరూ లోలోన కుమిలిపోతున్నారు.
ఇది సొంత ప్రభుత్వం.. పార్టీపై అసంతృప్తికి కారణం అవుతోంది. ఎంత రాజకీయ పార్టీ అయినా క్యాడర్‌ను ఆర్థికంగా బలపరిచే ప్రయత్నం చేయాలి. కానీ ఇక్కడ వైసీపీ నాయకత్వం అప్పుల్లోకి నెడుతోంది. ఇటీవల ధర్మాస ప్రసాదరావు కూడా ఇదే తరహాలో ఆవేదన వ్యక్తం చేశారు. అందరూ నష్టపోతున్నారని అన్నారు. ఇప్పుడు పంచాయతీ నిధులు కూడా లాగేసుకోవడంతో వైసీపీ క్యాడర్ అంతా.. ఆర్థికంగా కుంగిపోయే పరిస్థితి కనిపిస్తోంది.