తెలంగాణ బీజేపీలో అప్పుడే నేతల మధ్య కుర్చీ పంచాయతీ ప్రారంభమైనట్లుగా కనిపిస్తోంది. టీ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తన పాదయాత్ర వల్లనే బీజేపీకి ఊపొచ్చిందని ఎక్కడ చాన్స్ దొరికితే అక్కడ చెప్పుకుంటున్నారు. ఆయన ఓ అడుగు ముందుకేసి ఇప్పుడు తొలి సంతకం గురించి చెబుతున్నారు. అధికారంలోకి రాగానే పేదలందరికీ ఉచిత విద్యపైనే తొలి సంతకం పెడతామని చెప్పుకొస్తున్నారు. అయితే ఇక్కడ ఆయన కాస్త తెలివిగా వ్యవహరించారు. తాను తొలి సంతకం పెడతానని అనడం లేదు.. ముఖ్యమంత్రి కుర్చీలో ఎవరు కూర్చున్నా వారితో ఆ హామీ అమలు విషయంలో సంతకం పెట్టించే బాధ్యత తీసుకుంటానని అంటున్నారు.
బండి సంజయ్ ఉద్దేశం ఆయన చెప్పినట్లుగా కాకపోయినా.. తనకే పీఠం వస్తుందన్న నమ్మకంతో ఆయన అలాంటి మాటలు అంటున్నారని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. ఈటల రాజేందర్ చేరిక తర్వాత బీజేపీలో కుర్చీ రేస్ మరింతగా పెరిగిపోయింది. అందరి కన్నా టాల్ లీడర్‌గా.. ఢిల్లీ స్థాయి నేతగా కిషన్ రెడ్డి ఉన్నారు. రాష్ట్రంలో బీజేపీకి కొత్త ఊపు తెచ్చిన నేతగా బండి సంజయ్ ఉన్నారు. బండి ఊపు తగ్గిపోయిన తర్వాత హుజురాబాద్‌లో ఒంటి చేత్తో గెలిచిన నేతగా ఈటల రాజేందర్ ఉన్నారు. ఇలాంటి నేతల మధ్య పోటీ ప్రారంభం కావడం ఇప్పుడు బీజేపీ క్యాడర్లోనే అయోమయానికి కారణం అవుతోంది. ఎవరికి వారు తామే నేత అనిచెప్పుకోవడం గందరగోళానికి కారణం అవుతోంది.
ఈటల రాజేందర్‌ను సీఎం అభ్యర్థిగా చేస్తారన్న ప్రచారాన్ని కొద్ది రోజుల పాటు ఓ వర్గం మీడియా చేసింది. ఇదంతా ఆయన చేయించుకున్నారని బండి సంజయ్ వర్గీయులు అసంతృప్తితో ఉన్నారు. కిషన్ రెడ్డి కూడా తనను కాదని ఇతరులు టాప్‌లోకి రావడానికి ఇష్టపడరు. మొత్తంగా తెలంగాణ బీజేపీలో పరిస్థితి.. కాంగ్రెస్‌లో మాదిరిగా మారిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రేస్ అంతర్గతంగా ఉంటే చాలు ఇక కాంగ్రెస్ మాదిరిన మీడియా ముందుకు వస్తే మాత్రం .. ఆ పార్టీ గెలవకుండానే ఓడిపోతుదంని కొంత మంది ఆందోళన చెందుతున్నారు.