టాలీవుడ్ ఇండస్ట్రీ ఇప్పుడు ఉనికి సమస్యలో పడిందన్నది నిజం. ఏపీలో ఉన్న టిక్కెట్ రేట్లు అంతే ఉంటే ఇక ధియేటర్లు మూసేసుకోవడం మంచిదని ఎగ్జిబిటర్‌గా సురేష్ బాబు వ్యాఖ్యానించారు. మిగిలిన వారిదీ అదే మాట. నిర్మాతగా ఆయన భారీ సినిమాలు తీయరు కాబట్టి నిర్మాతగా స్పందించలేదని అనుకుందాం. భారీ నిర్మాత అయితే..ఇక సినిమాలు ఏపీలో రిలీజ్ చేసుకోవడం దండగని అంటారు. ఏ రకంగా చూసినా ఏపీలో ఖరారు చేసిన విధానం.. టిక్కెట్ రేట్లు… అదనపు షోలు.. ఇలా ఏదైనా సరే ఇండస్ట్రీకి ఏమాత్రం అనుకూలం కాదు. మరి ఇప్పుడేం చేయాలి..?
సినిమా టిక్కెట్ రేట్ల ఖరారు విషయంలో సీఎం జగన్ పునరాలోచించాలి అని చిరంజీవి ట్వీట్ ద్వారా విజ్ఞప్తి చేశారు. సురేష్ బాబు ఇంకాస్త గట్టిగానే ఇలా అయితే వ్యాపారాలు మూసుకోవడమే అన్నారు. అయితే.. ఈ స్పందన ఎవరికి వారు వ్యక్తం చేస్తున్నారు. కానీ టాలీవుడ్ ఏక తాటిపైకి రావడం లేదు. తమ సమస్యలేమిటో అందరూకలిసి చెప్పి ప్రభుత్వం తప్పు చేస్తుంటే అదే విషయం బహిరంగంగా చెప్పి .. ఒత్తిడి చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేయడం లేదు.
ఏపీ ప్రభుత్వం ఖచ్చితంగా బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడుతోందని టాలీవుడ్ పెద్దలు నమ్ముతున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోని అతి తక్కువ రేట్లను నిర్ణయించడం వెనుక తమ నుంచి ఏపీ ప్రభుత్వం ఏదో ఆశిస్తోందని వారు నమ్ముతున్నారు. ఈ కోణంలో టాలీవుడ్ పెద్దలతోనే వారి అనుమతితో వచ్చిన వారితోనే దఫదఫాలుగా చర్చలు సాగాయి. చివరికి జగన్ ఆత్మీయుడిగా.. వ్యాపార భాగస్వామిగా పేరు పొందిన నాగార్జున కూడా వచ్చి మాట్లాడారు. కానీ సమస్య పరిష్కారం కాలేదు.
ప్రభుత్వం తాము చేయాలనుకున్నది చేస్తోంది. ఇప్పుడు టాలీవుడ్ బతిమాలుకోవడమో.. పోరాటమో.. ఏదైనా ఐక్యంగా చేయాల్సి ఉంటుంది. ఎవరికి వారు చేస్తే టాలీవుడ్లో ఐక్యత లేదని తేలిపోతుంది. బయట బంధుత్వాలు.. రాజకీయాలు అన్నీ వదిలేసి..తమకు బతుకులు ఇచ్చిన పరిశ్రమ కోసం అందరూ కలిసి నడవాల్సిన సమయం ఆసన్నమయింది.కానీ కెరీర్లు అవసానదశకు తెచ్చుకున్న స్టార్లు.. ఇక తమదేముందిలో.. పరిశ్రమ ఎలా పోతే తమకెందుకులే అనుకుంటే మాత్రం.. ఎవరూ ఏం చేయలేరు.