ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పంచాయతీలకు ఇవ్వాల్సిన నిధుల విషయంలో ఏపీ సీఎం జగన్కు లేఖ రాశారు. అయితే ఇవి ఆర్థిక సంఘం నిధులను తీసుకున్న అంశంలో కాదు.. గత పంచాయతీ ఎన్నికప్పుడు ఏపీ ప్రభుత్వం హామీ ఇచ్చిన ఏకగ్రీవ పంచాయతీలకు ఇవ్వాల్సిన నిధుల గురించి. గత పంచాయతీ ఎన్నికల సమయలో ఏకగ్రీవాల కోసం ప్రభుత్వం ఒత్తిడి తెచ్చింది. ఈ క్రమంలో గ్రామాలకు ఆఫర్లు ప్రకటించారు. జీవో ఆర్టీ నెం. 34ని విడుదల చేశారు.
గతంలో అంటే 2013 నాటి జీవో నెం. 1274ని సవరించి కొత్త జీవో జారీ చేశారు. గతంలో రెండు కేటగిరీలు ఉండేవి. ఈసారి 4 తరగతులుగా విభజించి పంచాయతీలకు ప్రయోజనం కల్పిస్తామని జీవోలో పేర్కొన్నారు. రెండు వేల లోపు జనాభా ఉన్న పంచాయతీల్లో ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగితే ఆ పంచాయతీకి రూ.5 లక్షల వరకు నగదు ప్రోత్సాహం, అలాగే 2001 నుంచి 5000 లోపు జనాభా వుండే పంచాయతీలకు ఏకగ్రీవ ఎన్నికలు జరిగిన పక్షంలో రూ.10 లక్షలు నగదు ప్రోత్సాహం , 5001 నుంచి 10 వేల జనాభా వున్న పంచాయతీలకు ఏకగ్రీవం అయితే రూ.15 లక్షల నగదు ప్రోత్సాహం, పదివేల కన్నా అధికంగా వున్న పంచాయతీలకు రూ.20 లక్షల రూపాయల నగదు ప్రోత్సాహం అందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.
ప్రభుత్వం కృషి ఫలించింది. మొత్తంగా 2,199 పంచాయితీలు ఏకగ్రీవం అయ్యాయి. కానీ ఇప్పటికీ నయాపైసా ప్రోత్సాహకం అందించలేదు. దీన్నే గుర్తు చేశారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. ప్రోత్సాహకాల కోసం విడుదల చేసిన ఉత్తర్వులు ఉత్తుత్తివి కాదని నిరూపించాలని జగన్కు సవాల్ చేశారు. ఉన్న నిధులే ఖాళీ చేసిన సర్కార్.. ఇప్పుడు జీవో ఇచ్చిన నిధులను విడుదల చేస్తుదా అన్నది పెద్ద పజిల్.