ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీకి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆరు నెలల పొడిగింపు ఇచ్చింది. బెంగాల్లో చీఫ్ సెక్రటరీ పొడిగింపు వ్యవహారం వివాదాస్పదం కావడంతో ఇక ఏ రాష్ట్రంలోనూ చీఫ్ సెక్రటరీల స్థాయి వారికి పొడిగింపులు ఇవ్వకూడదని అనుకున్నట్లుగా ప్రచారం జరిగింది. కానీ కేంద్రం తమకు అనుకూలంగా ఉండే ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో నిర్ణయాలను కూడా అదే మాదిరిగా పాజిటివ్‌గా తీసుకుంటూ ఉంటుంది. ఈ ప్రకారం ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చిన రిక్వెస్ట్‌ను పరిగణనలోకి తీసుకుని సమీర్ శర్మ పదవీ కాలాన్ని మరో ఆరు నెలలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
సహజంగా మూడు నెలలకు మాత్రమే పొడిగింపు ఇస్తారు. ఆ తర్వాత మరోసారి మూడు నెలల పొడిగింపు రిక్వెస్ట్‌ను బట్టి ఇస్తారు. ఇక ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ రిటైర్ కావాల్సిందే. అయితే ఇక్కడ మాత్రం ఒకే సారి సమీర్ శర్మకు ఆరు నెలల పొడిగింపు లభించింది. దీంతో రెండు నెలల ముచ్చటగానే సీఎస్ పదవి కాలం మిగిలిపోతుందన్న ఊహాగానాలకు తెరపడినట్లయింది. ఆయన పదవి విరమణ కన్నా మరో ఆరు నెలలు పొడిగింపు లభించినందున వచ్చే ఏడాది జూన్ వరకే ఆయనే చీఫ్ సెక్రటరీగా ఉంటారు.
దీంతో ఆయన రిటైరైపోతారు.. చీఫ్ సెక్రటరీ అయిపోవచ్చని ఆశలు పెట్టుకుని జగన్ అక్రమాస్తుల కేసులో నిందితురాలిగా ఉన్న ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి, సీసీఎల్ఎ నీరబ్ కుమార్ ప్రసాద్‌లకు వెయిటింగ్ తప్పడం లేదు. మొత్తంగా చూస్తే కేంద్రంతో సన్నిహిత సంబంధాలు కొనసాగించడం వల్ల.. చాలా విషయాల్లో వ్యవహారాలు స్మూత్‌గా వెళ్లిపోతున్నాయి.