నంద్యాల వైకాపా ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి కొన్ని నెలల క్రితం కర్నూల్ జిల్లా పరిషత్ సమావేశంలో అధికార పార్టీ సభ్యులపై దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ఆయనపై కేసు నమోదు చేయడం జరిగింది. ఆ తరువాత వేరే కారణాలతో ఆయనపై మరికొన్ని కేసులు కూడా నమోదు చేయబడ్డాయి. అప్పుడు అయన మీడియాతో మాట్లాడుతూ తనపై తప్పుడు కేసులు పెట్టి ప్రభుత్వం తనను లొంగదీసుకోవాలని ప్రయత్నిస్తోందని కానీ తను ఇటువంటి కేసులను చూసి భయపడేవాడిని కానని చెప్పారు. ఆ కేసులలో ఆయన జైలుకి కూడా వెళ్లవలసి వచ్చింది. ఆ తరువాత బెయిల్ పై విడుదలయ్యి బయటకి వచ్చేరు.
నిన్న ఆయన, తన కుమార్తె అఖిల ప్రియతో కలిసి తెదేపాలో చేరబోతున్నట్లు మీడియాలో వార్తలు వచ్చేయి. దానిని ఆయన ఖండించలేదు. అంటే వారిరువురూ ఆ ఒత్తిడి కారణంగానే తెదేపాలో చేరుతున్నట్లు అనుమానించవలసివస్తోంది. వైకాపాలో ఉన్నప్పుడు జైలుకి పంపిన తెదేపా ప్రభుత్వమే ఇప్పుడు ఆయనకి మంత్రి పదవి ఆఫర్ చేస్తున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. వీటిపై ఇంతవరకు వైకాపా స్పందించలేదు కానీ ఈరోజు సాక్షి పేపరులో తెదేపా నేతలు తమ పార్టీ నేతలని, ప్రజా ప్రతినిధులకి ఫోన్లు చేస్తూ పార్టీ మారమని ప్రోత్సహిస్తున్నారని, అందుకు బారీగా ఆఫర్లు కూడా ఇస్తున్నారని ఒక కధనం ఇచ్చింది.
‘21 మంది తెదేపా ఎమ్మెల్యేలు తమతో టచ్చులో ఉన్నారు…ప్రభుత్వాన్ని అరగంటలో కూల్చి వేయగలనని’ వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చెప్పిన తరువాత, అప్రమత్తమయిన తెదేపా కూడా 29 మంది వైకాపా ఎమ్మెల్యేలు తమతో టచ్చులో ఉన్నట్లు ప్రకటించింది. సాక్షి కధనం కూడా దీనిని దృవీకరిస్తున్నట్లే ఉంది. అది నిజమని నిరూపించేందుకే వైకాపాలో సీనియర్ నేతగా పేరొందిన భూమానాగిరెడ్డిని ఆయన కుమార్తె అఖిల ప్రియను తెదేపాలోకి రప్పిస్తున్నట్లు భావించవలసి ఉంటుంది.
కేసులతో భూమానాగిరెడ్డిని లొంగ దీసుకోవడం నిజమనుకొంటే ఆ తరువాత ఇంచుమించు అటువంటి పరిస్థితే ఎదుర్కొంటున్న వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎంపి మిథున్ రెడ్డిల వంతు వచ్చినట్లు భావించాలి. ఆ తరువాత వైకాపా ఎమ్మెల్యేలు రోజా, కొడాలి నానిల వంతు అనుకోవలసి ఉంటుంది. అసెంబ్లీలో అనుచితంగా ప్రవర్తిస్తున్నందుకు వారిరువురిని రెండేళ్ళ పాటు అసెంబ్లీ నుండి సస్పెండ్ చేయాలని నిజ నిర్ధారణ కమిటీ సిఫార్సు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కానీ వీరందరినీ తెదేపాలో చేర్చుకొంటే పార్టీలో ముసలం పుట్టే ప్రమాదం ఉంటుంది కనుక ఆపని చేయకపోవచ్చును. ఈవిధంగా వారందరిపై తీవ్ర ఒత్తిడి తేవడం ద్వారా వారి (నోటిని) అదుపు చేయాలని తెదేపా భావిస్తుండవచ్చును. తద్వారా వైకాపాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడేవారు లేకుండా చేయగలిగితే జగన్మోహన్ రెడ్డి చాలా ఇబ్బందికర పరిస్థితులలో పడతారని తెదేపా భావిస్తోందేమో?
రెండు తెలుగు రాష్ట్రాలలో అధికార పార్టీలు ఈ ‘ప్రెజర్ పాలిటిక్స్’ శ్రీకారం చుట్టాయి. ఇప్పుడు అవి మొదలుపెట్టిన ఈ దుస్సంప్రదాయాన్ని మున్ముందు అధికారంలోకి వచ్చే పార్టీలు కూడా తప్పకుండా పాటించవచ్చును. కనుక రానున్న రోజుల్లో రాజకీయాలు మరింత నీచ స్థాయికి దిగజారవచ్చును. దాని వలన చివరికి వారే ఇబ్బందులు పడవలసి వస్తుంది. నష్టపోవలసి వస్తుంది.