అమరావతి రైతుల్ని పెయిడ్ ఆర్టిస్టులు, టీడీపీ కార్యకర్తలుగా చెప్పడమే వైసీపీ ఎమ్మెల్యేల విధానం. వారి పట్ల కనీస సానుభూతి చూపినా వైసీపీ హైకమాండ్‌కు వచ్చే ఆగ్రహాన్ని తట్టుకోవడం కష్టం. అయితే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాత్రం ఈ ప్రోటకాల్ను ఉల్లంఘించారు. ఆయన నెల్లూరు కొత్తూరు దగ్గర ఓ కల్యాణ మండపంలో ఉన్న రైతుల్ని పరామర్శించారు. వర్షం కారణంగా రైతులు ఈ రోజు కూడా పాదయాత్రకు విరామం ఇచ్చారు. అనూహ్యంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శిబిరానికి వచ్చారు.
రైతుల్ని ఆప్యాయంగా పలకరిచారు. ఏమి అవసరం అయినా తనకు ఫోన్ చేస్తే స్పందిస్తానని భరోసా ఇచ్చి వెళ్లారు. వైసీపీ ఎమ్మెల్యే తీరు ఆ పార్టీ వర్గాల్లోనే కాదు ఇతర పార్టీల్లోనూ చర్చనీయాంశమవుతోంది. శ్రీధర్ రెడ్డి తమ పార్టీ హైకమాండ్‌కు తెలిసే వచ్చారా లేక ఇంకేదైనా కారణం ఉందా అన్న చర్చ జరుగుతోంది. ఆయనకు వైసీపీలోని ఇతర ఎమ్మెల్యేలకు పెద్దగా పొసగదు. అంతర్గత రాజకీయాల కారణంగా అయితే .. అమరావతి రైతులకు మద్దతు ఎందుకు తెలుపుతారన్న డౌట్ కూడా వైసీపీ వర్గాల్లో ఉంది.
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీరుపై వైసీపీ హైకమాండ్ ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు చర్చనీయాంశం అయింది. రైతుల పాదయాత్రపై వైసీపీ స్పాన్సర్డ్ దాడులు జరుగుతాయని చాలా మంది అనుకున్నారు కానీ.. నిజంగా అయితే రైతులకు ఎమ్మెల్యేల నుంచి కూడా మద్దతు ఉందని.. ఈ ఘటన నిరూపిస్తోందని అమరావతి మద్దతుదారులంటున్నారు.