దొరికినచో జుత్తు.. లేకుండిన కాళ్లు
అనే నీతి ఈనాటికి పాతబడెను చూడు
దొరికినచో ఊరించుట లేకుంటే ‘ఉరి’oచుట
రాజనీతి రూపుగా ప్రవర్ధిల్లె నేడు !
జగన్ కోటరీ మీద, పచ్చటి వల పన్నినారు
పడిన చేపలన్నిటినీ పచ్చిగ దరిజేర్చుతారు
తలెగరేయు వారుండిన వేటువేయ తెగిస్తారు
క్రమశిక్షణ బూచి చూపి సదరు తంతు ముగిస్తారు !!
తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ను నీరుగార్చే దిశగా భిన్నమైన వ్యూహంతో ముందుకు సాగుతున్నట్లుగా కనిపిస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను తమ పార్టీలో గంపగుత్తగా చేర్చుకోవడం గురించి వారు ఇప్పుడు ఫోకస్ పెంచుతున్నారు. ఒక్కొక్క ఎమ్మెల్యేకు బేరం పెట్టి లాక్కోవడం కాకుండా, టోకుగా అనుచరు ఎమ్మల్యేలతో కలిసి గుంపుగా రాగలిగిన సీనియర్ నేతల మీదనే ఫోకస్ పెడుతున్న వైఖరి కనిపిస్తోంది. కర్నూలు జిల్లా కీలక నాయకుడు భూమానాగిరెడ్డి ని పార్టీలో చేర్చుకోవడం కనిపిస్తోంది. ఆయన వెంట మరో నలుగురు ఎమ్మెల్యేలు కూడా వెళుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
వైకాపా వారిని చేర్చుకోవడానికి చంద్రబాబు సర్కారు తాయిలాలు ఆఫర్ చేస్తున్నదనే వార్తలు కూడా వస్తున్నాయి. తాయిలాలకు లొంగిన వారిని చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నట్లు వైకాపా ప్రచారం చేస్తోంది. అదే సమయంలో వైకాపాకు చెందిన అయిదుగురిమీద వేటు వేయడానికి క్రమశిక్షణ కమిటీ సిఫారసు చేయడం గమనిస్తే తమ తాయిలాలకు లొంగే అవకాశం లేని వారి మీద ఇలాంటి క్రమశిక్షణ కత్తి దూస్తున్నదా అనే అనుమానం జనానికి కలుగుతోంది.