రాయలసీమ, నెల్లూరు జిల్లాలను అతలాకుతరం చేసిన వరద పరిస్థితులను అంచనా వేయడానికి వచ్చిన కేంద్ర బృందం ముఖ్యమంత్రిని కలిసింది. అంతకు ముందు మూడు రోజుల పాటు వారు క్షేత్ర స్థాయిలో పర్యటించారు. వీరు కలిసిన తర్వాత ఏపీ సీఎంవో నుంచి ఓ ప్రెస్‌నోట్ రిలీజయింది. ఇందులో వారు ఎంత నష్టం జరిగిందని అంచనా వేశారో క్లారిటీగా చెప్పలేదు.. సీఎం జగన్ పనితీరుకు మాత్రం వందకు వంద మర్కులేసినట్లుగా చెప్పుకున్నారు. వారు అసలు విషయం కన్నా జగన్‌ను పొగడటానికే ఎక్కువ సమయం కేటాయించారన్నట్లుగా ఆ ప్రెస్‌నోట్‌లో ఉంది. వారెవరూ మీడియాతో మాట్లాడలేదు కాబట్టి.. ప్రభుత్వం పంపింది కాబట్టి వారు అలా చెప్పారని కోవాల్సిందే.
జగన్ నాయకత్వంతో రాష్ట్ర ప్రభుత్వం పనితీరు ప్రశంసనీయం, అంకిత భావంతో పనిచేసే అధికారులు ఉన్నారని సామాన్య జనం, రాజకీయ ప్రతినిధులు, మీడియా ప్రతినిధులు అందరూ ప్రభుత్వం పనితీరును అద్భుతమన్నారని సర్టిఫికెట్ ఇచ్చేశారు. ఇంత భారీ విపత్తు వస్తే రగా కరెంటు పునరుద్ధరణ అన్నది సహజంగా జరగదని కానీ ఇప్పుడు మాత్రం అఘమేఘాలపై చేసేశారని పొగిడేశారు. కలెక్టర్లకు కావాల్సినన్ని నిధులు ఇచ్చారని.. వాటితో పనులు చేశారని కూడా వారు నివేదిక ఇచ్చారట. ఇన్ని పొగడ్తలు కురిపించిన వాళ్లు చివరికి ఏమైనా సాయం చేయాలని నివేదిక ఇస్తారా లేదా అన్నదానిపై క్లారిటీలేదు.
అయితే సీఎం జగన్ మాత్రం తమ దగ్గర విపత్తు నిధులేమీ లేవని.. కోవిడ్ నియంత్రణా చర్యలకోసం వినియోగించినందువల్ల ఎస్టీఆర్ఎఫ్ నిధులు నిండుకున్నాయని ..పనులు చేయాలంటే నిధులు అవసరం, వెంటనే అడహాక్ ప్రాతిపదికన నిధులు ఇవ్వాలని జగన్ కోరారు. తాను రూ. ఆరు వేల కోట్ల నష్టం జరిగిందని నివేదిక ఇచ్చామని దాని ప్రకారం.. ఇప్పించాలన్నారు. అసలు ఈ బృందం కేంద్రానికి ఇచ్చే నివేదికపైనా ఏదైనా సాయం అందుతుందా లేదా అనేది తేలుతుంది. దాని కంటే ముందు పొగడ్తలతో కడుపు నింపేసి వెళ్లారు సభ్యులు.