విశాఖపట్నం, ఓడిశాలోని కోరాపుట్ లో పర్యటించిన కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ రెండు రాష్ట్రాలలో మావోయిష్టుల ప్రభావం గురించి స్థానిక పోలీస్ ఉన్నతాధికారులతో చర్చించారు. ఆ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ఏడాది కాలంగా దేశంలో వామపక్ష తీవ్రవాదం బాగా తగ్గుముఖం పట్టిందని చెప్పారు. ఛత్తీస్ ఘడ్, జార్ఖండ్ రాష్ట్రాలలో మాత్రం ఇంకా మావోయిష్టులు తమ ఉనికిని చాటుకొంటూనే ఉన్నారని రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. మావోయిష్టులు హింసామార్గం విడిచిపెట్టి జనజీవన స్రవంతిలో కలవాలనుకొంటే ప్రభుత్వం వారితో చర్చలకు సిద్దంగా ఉందని ప్రకటించారు.
గత నాలుగైదు దశాబ్దాలలో కేంద్రంలో, రాష్ట్రాలలో అధికారం చెలాయించిన అనేక రాజకీయ పార్టీలు మావోయిష్టుల సమస్యను శాంతిభద్రతల సమస్యగానే పరిగణిస్తూ, అందుకు అనుగుణంగానే చర్యలు చేపట్టాయి. వాటిలో కొన్ని ప్రభుత్వాలు మావోయిష్టులతో చర్చలకు సిద్దపడినా ఇరు పక్షాలు తమ వైఖరికే కట్టుబడి ఉండాలనుకోవడంతో నేటికీ దేశంలో అనేక రాష్ట్రాలలో మావోయిష్టులు తమ ఉనికిని చాటుకొంటూనే ఉన్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా మళ్ళీ ఇదే తంతు నడుస్తుంటుంది. ఇప్పుడు హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ చేసిన ప్రకటన కూడా అటువంటిదే కనుక దాని వలన కూడా ఎటువంటి ప్రయోజనం ఆశించనవసరం లేదు.
ఆయన కోరాపుట్ లో పోలీస్ ఉన్నతాధికారులతో మావోయిష్టుల గురించి చర్చిస్తున్న సమయంలోనే గురువారం రాత్రి జార్ఖండ్ లో మావోయిష్టులకు, పోలీసులకి మధ్య కాల్పులు జరిగాయి. దానిలో నలుగురు నక్సల్ మరణించారు. ఆ ఎన్కౌంటర్ ని రాజ్ నాథ్ సింగ్ సమర్ధించుకొన్నారు. ఈ నేపధ్యంలో మావోయిష్టులతో ప్రభుత్వం చర్చలకు సిద్దమని ఆయన చేసిన ప్రకటన నిరర్ధకమేనని అర్ధమవుతోంది.
ఒకవేళ ప్రభుత్వం ఏకపక్షంగా కాల్పుల విరమణ పాటించుతూ, చర్చలకు సిద్దమయినప్పటికీ మావోయిష్టుల గొంతెమ్మ కోర్కెలు తీర్చడం ప్రభుత్వం వల్ల సాధ్యం కాదు. కనుక ప్రభుత్వం, మావోయిష్టుల ఆలోచనా వైఖరిలో మార్పు రానంతవరకు ఈ సమస్యకు పరిష్కారం కూడా దొరకదు. ఒకపక్క ప్రభుత్వంలో నేతలు మారిపోతుంటే, మరోపక్క మావోయిష్టులలో కూడా నేతలు మారుతూనే ఉంటారు. కనుక వారి ఆలోచనలు కూడా ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి. కనుక ఇరువర్గాల మధ్య అవగాహన ఏర్పడే అవకాశమే ఉండదు కనుక ఈ వామపక్ష ఉగ్రవాదం దేశంలో ఎప్పటికీ రావణకాష్టంలాగ రగులుతూనే ఉంటుందని చెప్పవచ్చును.