ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు పలుకుబడి పడిపోయింది. పదవి అందిన మొదట్లో సస్పెషన్లు.., టీవీచానళ్ల బహిష్కరణల నిర్ణయాన్ని అలవోకగా చేసిన ఆయనకు ఇప్పుడు పదవి మిగిలింది కానీ నిర్ణయాలు తీసుకునే అధికారం లేకుండా చేసారు. కొత్తగా కోర్ కమిటీని బీజేపీ హైకమాండ్ నియమించింది. అందులో అటు వైసీపీ సానుభూతిపరులతో పాటు ఇటు టీడీపీ సానుభూతిపరులుగా పేరు తెచ్చుకున్న వారికీ ప్రాధాన్యం దక్కింది. ఎటొచ్చి.. నిఖార్సుగా బీజేపీకి పని చేస్తారని పేరు పడిన వారే పెద్దగా లేరు.
బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా తాజాగా ప్రకటించిన కోర్ కమిటీలో పురందేశ్వరి, సత్యకుమార్, కన్నా లక్ష్మీనారాయణ , సుజనాచౌదరి, సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్, జీవీఎల్ నరసింహారావు, మధుకర్, ఎమ్మెల్సీ మాధవ్ వంటి వారు ఉన్నారు. ఇంతకు ముందు కూడా ఓ కోర్ కమిటీ ఉంది. కానీ దాన్ని ఎప్పుడూ పట్టించుకోలేదు. నిర్ణయాలను సోము వీర్రాజు తనకు నచ్చిన వారితో సమావేశమై తీసుకునేవారు. టీడీపీ నుంచి వచ్చిన ఎంపీలను అసలు పిలిచేవారు కాదు. పట్టించుకునేవారు కాదు. దీంతో జేపీ నడ్డా .. కోర్ కమిటీని నియమించి.. అందులోనే నిర్ణయాలు తీసుకోవాలని ఆదేశించారు.
టీడీపీ నుంచి నేతలను టీడీపీ సానుభూతి పరులని.. ఓ సామాజికవర్గం వారని చెప్పి దూరంగా ఉంచుతూ వచ్చారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకున్న వారంతా వైసీపీ సానుభూతిపరులుగా గుర్తింపు పొందారు. అధికారంలో ఉన్న వైసీపీని వదిలేసి టీడీపీని విమర్శిస్తూ ఉంటారు. ఈ పరిణామాలపై అమిత్ షాకూ స్పష్టమైన సమాచారం ఉండటంతో అందరూ కలిపి నిర్ణయాలు తీసుకునేలా చేశారు. ఆయన ఆదేశించారు.. జేపీ నడ్డా పాటించారు. ఎలా చూసినా ఇప్పటి వరకూ వైసీపీకి ఏకపక్షంగా వ్యవహరించిన ఏపీ బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో ఇక ముందు కాస్తంత మార్పు వచ్చే అవకాశం మాత్రం ఉంది.