1983… భారత క్రికెట్ చరిత్రలో సువర్ణాధ్యాయం. ప్రపంచ క్రికెట్ లో ఓ కొత్త ఛాంపియన్ ఉద్భవించిన రోజు. అప్పటి నుంచే.. దేశంలో క్రికెట్ కు ఆదరణ మొదలైంది. ఇప్పుడు క్రికెట్ కొన్ని వేల కోట్ల రూపాయలతో ముడి పడిన ఆటగా మారడానికి కారణం.. కపిల్ దళం.. 1983 చేసిన అద్భుతమే.
అయితే.. 1983 కప్ మన చేతికి అంత ఈజీగా చిక్కలేదు. ఎన్నో అవమానాలు, అనుమానాలు, వైఫల్యాలు దాటుకుని వెళ్తే గానీ, అద్భుతం జరగలేదు. `ఒక్క మ్యాచ్ అయినా గెలుస్తారా` అంటూ హేళన చేసిన చోట.. కనీసం హోటెల్స్ నుంచి గ్రౌండ్ కి టీమ్ ఇండియా కోసం సరైన బస్సులు కూడా ఇవ్వలేని చోట.. `ఈసారి కప్ మేం కొడతాం` అని చెబితే – మీడియా కూడా నవ్విన చోట – గెలిచాం. 1983లో కప్ మాత్రమే కాదు.. ప్రపంచ క్రికెట్ ప్రేమికుల హృదయాల్ని కూడా గెలుచుకున్నాం. ఇప్పుడు ఆ సంగతులన్నీ… 83 అనే సినిమాలో చూపించోతున్నారు. కపిల్ దేవ్ గా రణవీర్ సింగ్ నటించిన సినిమా ఇది. కబీర్ ఖాన్ దర్శకుడు. డిసెంబరు 24న వస్తోంది. ట్రైలర్ ఈ రోజు విడుదలైంది. ట్రైలర్లో అన్నీ గూజ్బమ్ మూమెంట్సే. ఓ స్పోర్ట్స్ డ్రామాని ఎలా తెరకెక్కించాలో.. అలా చూపించాడు కబీర్ ఖాన్. ట్రైలర్ చూసినవాళ్లంతా 1983 జ్ఞాపకాల్లోకి వెళ్లిపోవడం ఖాయం. ఆ జనరేషన్ నుంచి వచ్చిన వాళ్లైతే మరింత ఈజీగా కనెక్ట్ అయిపోతారు. డిసెంబరు 24 నుంచి థియేటర్లు క్రికెట్ స్టేడియాలుగా మారిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. దీపికా పదుకొణె, జీవా, తాహీర్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.