కాపు నేత ముద్రగడ పద్మనాభం కాపులకు రిజర్వేషన్లు, రుణాలు, జస్టిస్ మంజూనాద్ కమిటీ కాల పరిమితి, తుని ఘటనలపై పోలీసుల విచారణ, కేసులు నమోదు ఇలాగ ప్రతీ విషయం గురించి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులతో కూలంకుషంగా చర్చలు జరిపి అవి ఆమోదయోగ్యంగా ఉన్నాయని భావించిన తరువాతే తన ఆమరణ నిరాహార దీక్ష విరమించిన సంగతి అందరికీ తెలుసు. ఆ తరువాత రెండు రోజులకే తనకు ఇచ్చిన హామీలను అన్నిటినీ అమలుచేయాలని లేకుంటే మళ్ళీ ఉద్యమిస్తానని హెచ్చరిస్తూ ముఖ్యమంత్రికి ఆయన ఒక లేఖ వ్రాసారు. దానికి ప్రభుత్వం స్పందించినట్లు కనబడలేదు. ఆ తరువాత ముద్రగడ కూడా మళ్ళీ ఎటువంటి హడావుడి చేయలేదు.
ఈరోజు ఆయన తుని సమీపంలో గల కశింకోటలో కాపు నేతలతో సమావేశం అయ్యి ప్రభుత్వం ఇచ్చిన హామీలు, వాటి అమలు గురించి చర్చించారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తునిలో విద్వంసానికి పాల్పడినవారిని గుర్తించే మిషతో పోలీసులు అమాయకులను వేధిస్తున్నారని ఆరోపించారు. ఆ విషయంలో పోలీసులు నేరుగా తననే విచారించవచ్చునని చెప్పారు. ప్రభుత్వం తనకు ఇచ్చిన మాటను పట్టించుకోకుండా విచారణ పేరిట పోలీసులు అమాయక ప్రజలను వేధించడం సరికాదని ముద్రగడ అన్నారు. ఆ రోజు సభను నేనే నిర్వహించాను కనుక పోలీసులు నన్నే విచారించవచ్చునని ముద్రగడ అన్నారు.
ముద్రగడ చెప్పింది నూటికి నూరు శాతం నిజమే. ఆ రోజు ఆయన అక్కడ పోలీసుల అనుమతి తీసుకోకుండా సభను నిర్వహించారు. రైల్ రోకో రాస్తా రోకోలకి పిలునిచ్చారు. వాటిలో ఆయన కూడా పాల్గొన్నారు. అంతవరకు ప్రశాంతంగా సాగిన కాపు ఐక్య గర్జన సభ విద్వంసానికి దారి తీయడానికి ప్రధాన కారణం రైల్, రాస్తా రోకోలకి ఆయనిచ్చిన పిలుపే. ఆ సంగతి ఆయన కూడా స్వయంగా అంగీకరిస్తున్నారు. పోలీసులు, రైల్వే పోలీసులు ఆయనపై కొన్ని కేసులు కూడా నమోదు చేసారు. కానీ ఆయనని అరెస్ట్ చేసి విచారించే సాహసం చేయలేకపోతున్నారు. ఆ పని చేస్తే కాపులను, ప్రతిపక్షాలను మళ్ళీ రెచ్చ గొట్టినట్లవుతుందనే భయంతోనే ప్రభుత్వం అందుకు సాహసించలేకపోతోంది.
అది సహేతుకంగానే కనిపిస్తున్నప్పటికీ, ఒక భారీ విద్వంసానికి ప్రజలను ప్రేరేపించి, ప్రభుత్వానికి కోట్లాదిరూపాయల నష్టం కలిగించిన వ్యక్తి ఎవరో ఖచ్చితంగా తెలిసి ఉన్నప్పటికీ, ఆయనే స్వయంగా ఆ విషయాన్ని అంగీకరిస్తున్నప్పటికీ ప్రభుత్వం చట్టప్రకారం ఆయనపై చర్యలు చేపట్టలేకపోవడం ప్రభుత్వ అసమర్దత, వైఫల్యంగానే భావించాల్సి ఉంటుంది. అటువంటప్పుడు ఇతరులపై కేసులు నమోదు చేసి వారిని విచారించడం సరికాదు. అది అర్భకులపై ప్రతాపం చూపడంగానే భావించవచ్చును. చట్టం ముందు అందరూ సమానమనే పడికట్టు పదం గొప్పగా చెప్పుకోవడానికి తప్ప ఆచరణలో అది సాద్యం కాదని ఇది రుజువు చేస్తోంది.