‘అఖండ’ సినిమా థియేటర్ లో సందడి చేస్తోంది. మామూలు సందడి కాదు. బాలయ్య దెబ్బకి సౌండ్ బాక్సులు బద్దలౌతున్నాయి. టాక్ తో సంబంధం లేకుండా ప్రేక్షకులు థియేటర్ లోకి వస్తున్నారు. తొలిరోజు కలెక్షన్ కూడా అదిరిపోయింది. మొత్తానికి థియేటర్స్ కి కొత్త ఊపు తెచ్చింది అఖండ. మాస్ ఎలివేషన్లు, ఊర మాస్ యాక్షన్ సీన్లు, అఘోరగా బాలయ్య… ఇవన్నీ ఫ్యాన్స్ కి మాస్ జాతర చూపించాయి.
అయితే ఇంతటి మాస్ కంటెంట్ రావడానికి కారణం గల తెరవెనుక హీరోలు గురించి చెప్పుకోవాలి. అఖండ తెరవెనుక ఫస్ట్ హీరో తమన్. అవును.. ఈ సినిమాని మాస్ జాతరగా మార్చిన మొదటి టెక్నిషియన్ తమన్. అఖండలో అడుగుకో ఎలివేషన్ వుంది. ఫైట్లు ఊర మాస్ గా వున్నాయి. అఘోరగా బాలయ్య ఎంట్రీ, దాని నేపధ్యం చుట్టూ వున్న ఎలివేషన్… తమన్ కి బోలెడు స్కోప్ ఇచ్చినట్లయింది. ఈ స్కోప్ ని తమన్ వందకి వంద శాతం వాడుకున్నాడు. ప్రతి ఎలివేషన్ కి పూనకం వచ్చేట్లు నేపధ్య సంగీతం అమర్చాడు. అఘోరా నేపధ్యంకి స్పెషల్ గా రీసెర్చ్ చేసిమరీ స్కోర్ చేశాడు. తమన్ నేపధ్య సంగీతం అద్భుతంగా వర్క్ అవుట్ అయ్యింది. జై బాలయ్య పాటతో ఫ్యాన్స్ కి కావాల్సిన కిక్ ఇచ్చాడు. హెవీ యాక్షన్ వున్న అఖండ ఆత్మని అద్భుతంగా పట్టుకోవడంలో తమన్ సక్సెస్ అయ్యాడు.
అఖండలో తెరవెనుక వున్న రెండో హీరో.. ఫైట్ మాస్టర్స్. రామ్ లక్ష్మణ్, శివ. అఖండ యాక్షన్స్ ని మరో లెవెల్ కి తీసుకెళ్ళిపోయారు. సింహ, లెజండ్ సినిమాలని దాటి, ఒక దశలో హద్దు చెరిపేసి మరీ యాక్షన్ డిజైన్ చేశారు. బాలయ్య ఎంట్రీ ఫైట్ .. ఇంటర్వెల్ ముందుకు యాక్షన్ సీక్వెన్స్.. అఘోర ఎంట్రీ తర్వాత సెకెండ్ హాఫ్ మొత్తం దాదాపు యాక్షన్ ఘట్టాలు. సగానికి పైగా సినిమాని వాళ్ళే తీసిపెట్టారు. బాలయ్యని ఫ్యాన్స్ ఎలా చూడాలని అనుకుంటున్నారో ఆ అంచనాలని తగ్గట్టు యాక్షన్ డిజైన్ చేశారు. ఈ రకంగా అఖండ విజయంలో కీలక పాత్ర.. యాక్షన్ డిజైన్ చేసిన ఫైట్ మాస్టర్స్ కి దక్కింది.