ప్రశాంత్ కిషోర్ తనకు సోదరుడని ఆయన తన రాజకీయ పార్టీకి సేవలు అందిస్తారని షర్మిల చాలా గట్టి నమ్మకంతో ఉన్నారు. అదే పనిగా ఆ విషయాన్ని మీడియాతోనూ చెప్పుకున్నారు. పీకే టీం వచ్చి షర్మిలతోనూ సమావేశం అయిందన్న ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ షర్మిలను లెక్కలోకి తీసుకోకుండా టీఆర్ఎస్‌కు సేవలు అందిస్తున్నారన్న ప్రచారం ఊపందుకుంది. కేసీఆర్ ఢిల్లీలో పీకేను కలిశారని.. ఆయన టీం ప్రగతి భవన్‌కు వచ్చి కేసీఆర్‌తో చర్చించిందని. డీల్ సెట్ అయిందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
ఇప్పటికే తెలంగాణలో టీఆర్ఎస్ కోసం పీకే టీం రంగంలోకి దిగిందని సర్వేలు ప్రారంభించిందని అంటున్నారు. ప్రదానమైన స్ట్రాటజిస్ట్‌గా ఆయన ఇచ్చిన సలహాలమేరకే కేసీఆర్ ఇటీవల ఘాటు వ్యాఖ్యలు ప్రారంభించారన్న చర్చ కూడా నడుస్తోంది. ఈ సమయంలో ప్రసాంత్ కిషోర్‌పై షర్మిల ఆశలు వదులుకున్నట్లేనని భావించవచ్చు. ఎందుకంటే ఒకే రాష్ట్రంలో రెండు పార్టీలకు పీకే సేవలు అందించడం అసాధ్యం.
గెలిచే పార్టీలతో టై అప్ అయి… గెలుపు క్రెడిట్తన ఖాతాలో వేసుకంటారని ఇప్పటికే పీకే టీంపై ఓ విమర్శ ఉంది. నిజానికి షర్మిల పార్టీకి పని చేసి.. ఆమెకు గెలుపు లభించేలా చేస్తేనే పీకే టీంలో నిజంగా స్ట్రాటజిస్ట్ ఉన్నాడని నమ్ముతారు.అయితే అధికార పార్టీకో.. అధికారంలోకి వస్తుందన్న ప్రతిపక్ష పార్టీతోనే జట్టు కట్టి క్రెడిట్ పొందితే ప్రయోజనం ఏముంటుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. కారణం ఏమైతేనేం .. పీకే షర్మిలకు హ్యాండిచ్చేసినట్లేనని తేలిపోయింది.