వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో ప్రస్తుతం హైడ్రామా నడుస్తోంది. పార్టీ ఎంపీ భూమా నాగిరెడ్డి, తన కూతురు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, మరికొందరు అనుచరులైన ఎమ్మెల్యేలతో కలిసి తెలుగుదేశం పార్టీలోకి చేరబోతున్నారనే విషయం చుట్టూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చురుగ్గా కదులుతున్నాయి. ఒకవైపు భూమా నాగిరెడ్డిని బుజ్జగించి.. పార్టీ మారకుండా చూడడానికి వైకాపాకు చెందిన ట్రబుల్ షూటర్‌లు అనదగిన పెద్ద తలకాయలు అందరూ ఇప్పటికే రంగంలో దిగారు. అయితే ఇందులో హైడ్రామా ఏంటంటే.. ఒకవైపు పార్టీ కీలక నాయకులను భూమా నాగిరెడ్డి ఇంటికి పంపి ఆయనను బుజ్జగించడానికి ప్రయత్నిస్తూనే.. మరోవైపు ఆయన మాట వినని పరిస్థితే వస్తే గనుక.. ఆయనను ఒంటరిని చేసి పార్టీ బయటకు పంపాలనే వ్యూహంతో వైఎస్ జగన్ స్వయంగా రంగంలోకి దిగడం.
శనివారం ఉదయం నుంచి వైకాపా రాజకీయాలు వేడెక్కాయి. శుక్రవారం రాత్రి భూమా నాగిరెడ్డి హైదరాబాదుకు వచ్చిన సంగతి తెలిసిందే. శనివారం ఉదయం ఆయన ఇంటికి వైకాపా తరఫున రాయబారులుగా సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి వెళ్లారు. పని చక్కబడలేదు. తర్వాత మళ్లీ భూమా అభిప్రాయం తెలుసుకుని జగన్ ఇంటికి వెళ్లి ఆయనను కలిసిన సజ్జల, జగన్ తరఫు తాజా ప్రతిపాదనను అందుకుని మళ్లీ భూమా ఇంటికి వెళ్లి ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో.. జగన్ చిన్నాన్న ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కూడా.. భూమా నాగిరెడ్డి ఇంటికి వచ్చి ఆయనతో మంతనాలు ప్రారంభించారు. అయితే ఎందరు వచ్చి ఎన్ని చెబుతున్నా భూమా మాత్రం ఒక పట్టాన దిగిరావడం లేదని, ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేసినట్లు చెబుతున్నారని సమాచారం.
ఆయనను బుజ్జగించే ప్రయత్నాలన్నీ ఒకవైపు నడుస్తూ ఉండగా.. మరోవైపు కర్నూలు జిల్లా వైకాపా రాజకీయాలకు సంబంధించినంత వరకు భూమాను ఒంటరిని చేసేయాలన జగన్ మరోవైపు తనే స్వయంగా రంగంలోకి దిగారు. కూతురు అఖిలప్రియ, మరో ముగ్గురు ఎమ్మెల్యేలతో సహా భూమా నాగిరెడ్డి తెదేపాలోకి వెళ్తున్నారని, ఇంత పెద్దసంఖ్యలో అందరినీ తీసుకువస్తున్నందునే భూమాకు చంద్రబాబు భారీ తాయిలంగా కుటుంబానికి మంత్రి పదవి ఆఫర్ చేస్తున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో జగన్ ఇలా చక్రం అడ్డువేసే ప్రయత్నం చేస్తున్నారు. కర్నూలు జిల్లాకు చెందిన వైకాపా ఎమ్మెల్యేలతో ఆయన తన నివాసంలో సమావేశం నిర్వహించి.. వారెవ్వరూ పార్టీ మారకుండా నష్టనివారణ చర్యలు ప్రారంభించారు. ఈ సమావేశానికి భూమా బంధువు ఎస్వీ మోహన్‌రెడ్డి, కీలక అనుచరులు ఐజయ్య, రాజశేఖరరెడ్డి, తదితరులు హాజరయ్యారు. వీరిని నియంత్రిస్తే భూమా తెదేపాలోకి ఒంటరిగా వెళ్లాల్సి వస్తుందని.. దానివల్ల ఆయనకు దక్కేదేమీ ఉండదని జగన్ వ్యూహంగా భావిస్తున్నట్లు కనిపిస్తోంది. జగన్ సమావేశానికి వచ్చిన కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలంతా ఆయన మీద విశ్వాసంతో పార్టీలో ఉండిపోతారా? లేదా, తమకు పెద్ద దిక్కు అయిన భూమా వెంట నడుస్తారా అనేది వేచిచూడాలి.