సినీ పరిశ్రమను వేధించవద్దని తమిళ నటుడు సిద్ధార్థ్ వరుసగా చేసిన ట్వీట్లు ఇప్పుడు వైరల్ అయ్యాయి. నిజానికి ఆయన ఫుల్ టైం తెలుగు యాక్టర్ కాదు. కానీ తెలుగులో కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ టాలీవుడ్ మొత్తం తమకు ఎదురవుతున్న సమస్యల గురించి ఒక్కరంటే ఒక్కరూ స్పందించలేదు. కానీ సిద్ధార్ధ్ స్పందించారు. మెగాస్టార్ చిరంజీవి వంటి వారు ప్లీజ్… ప్లీజ్ అంటున్నారు. కానీ బతిమాలటంతో ఎప్పుడూ ఫలితాలు ఉండవని.. పోరాడి సాధిస్తేనే ఏదైనా నిలబడుతుందని గుర్తించలేకపోతున్నారు. ఇప్పుడు సిద్ధార్థ్ ఈ విషయంలో అందరికీ ఓ సవాల్ విసిరాడు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో టాలీవుడ్ ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. అక్కడి పాలకులు ఏం ఆశిస్తున్నారో కానీ మొత్తంగా ఇండస్ట్రీని పూర్తి స్థాయిలో దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నారు. టిక్కెట్ ధరలు రూ. ఐదు నుంచి ప్రారంభమవుతాయని .. తెలిసి దేశం మొత్తం ఆశ్చర్యంగా చూసింది. ఇక బెనిఫిట్ షోలు… అదనపు ఆటలు ఇలా అనేక ఆంక్షలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితి ఉంటే ధియేటర్లు మూసేసుకోవడం మంచిదని ఇప్పటికే అనేక మంది ఎగ్జిబిటర్లు ఫిక్సయ్యారు. కానీ టాలీవుడ్ పెద్దల్లో మాత్రం చలనం లేదు.
ప్రభుత్వంపై తిరగబడితే అసలుకే మోసం వస్తుందని .. ఆస్తులపై దాడులు చేస్తారని.. మరొకటని ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దలు భయపడుతున్నారనేది బహిరంగసత్యం. అందుకే ప్రభుత్వం ఈ విషయంలో మరింత దూకుడుగా ఉంది. బహిరంగ బెదిరింపులకు పాల్పడుతోంది. తమ అభిప్రాయాలను సైతం నిక్కచ్చిగా చెప్పలేక అణుచుకుంటోంది. నిత్యావసర వస్తువులు.. మద్యం వంటి వాటిపై లేని నియంత్రణ… ప్రజలకు ఇష్టమైతే చూస్తారు..లేకపోతే లేదనే సినిమాపై ఎందుకని ప్రతి ఒక్కరికీ అడగాలని ఉంది. కానీ ఎవరూ అడగడం లేదు.
టాలీవుడ్‌కు ఇప్పుడు సిద్ధార్థ్ ఓ దారి చూపించారు. ఇప్పుడైనా టాలీవుడ్ మొత్తం ఏకమై ప్రభుత్వంపై ఉద్యమం ప్రకటిస్తే సరి.. లేకపోతే మరింతగా అణిచివేస్తారు. టాలీవుడ్ గొంతెమ్మ కోరికలేం కోరడంలేదు.. అన్ని రాష్ట్రాల్లో టిక్కెట్ రేట్లు ఎలా ఉన్నాయో అలానే ఉండాలని కోరుతోంది. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగానే నిబంధనలు ఉండాలని అంటోంది. ఈ కనీస హక్కులకు కూడా సారగిలపడిపోతే మొదటికే మోసం వస్తుంది.అందుకే కార్యాచరణ ఖరారు చేసుకోవాల్సి ఉంది.