ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రోశయ్య కన్నుమూశారు. ఉదయం లోబీపీ రావడంతో ఆయనను కుటుంబసభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన తుది శ్వాస విడిచినట్లుగా గుర్తిచారు. ఆయన వయసు 88 సంవత్సరాలు. వృద్ధాప్యం కారణంగా ఆయన చాలా కాలంగా ఇంటికే పరిమితమయ్యారు. చాలా తక్కువ సందర్బాల్లో మాత్రమే బయటకు వస్తున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన తర్వాత రోశయ్యను హైకమాండ్ సీఎంగా ఎంపిక చేసింది.
ఆ తర్వాత పార్టీలో ఏర్పడిన పరిణామాలతో తాను పదవిలో కొనసాగలేనని ఆయన వైదొలిగారు. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డిసీఎం అయ్యారు. సీఎంగా పదవి నుంచి వైదొలిగిన తరవాత రోశయ్య తమిళనాడు గవర్నర్గా నియమితులయ్యారు. 2011 ఆగస్టు 31 నుంచి 2016 ఆగస్టు 30 వరకూ తమిళనాడు గవర్నరుగా తన సేవలు అందించారు. పదవి కాలం పూర్తయిన తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కొణిజేటి రోశయ్య 1933, జూలై 4న గుంటూరు జిల్లా వేమూరు గ్రామములో జన్మించారు.
గుంటూరు హిందూ కళాశాలలో చదువుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున 1968, 1974, 1980లలో శాసనమండలి సభ్యునిగా ఎన్నికయ్యారు. తొలిసారిగా మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వములో రోడ్డు రహదార్లు శాఖ, రవాణ శాఖల మంత్రిగా పనిచేశారు. రాజకీయాల్లో హుందా తనం ఉన్న నేతగా పేరు తెచ్చుకున్నారు.