కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమై ఎన్నికలకు వెళితేనే బీజేపీని ఎదుర్కోగలరు..లేకపోతే బీజేపీదే మళ్లీ అధికారం అని.. బెంగాల్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రశాంత్ కిషోర్ బహిరంగంగానే చెప్పారు. అంతే కాదు ఆయన ప్రాంతీయ పార్టీలను కాంగ్రెస్ దగ్గరకు చేర్చేందుకు ప్రయత్నించారు. అప్పుడు ఆయన కాంగ్రెస్‌లో చేరుతారన్న ప్రచారం జరిగింది.కానీ ఇప్పుడు ఆయన మనసు మార్చుకున్నారు. మాట కూడా మార్చారు. ఇప్పుడు ప్రాంతీయ పార్టీలకు నేతృత్వం వహించేందుకు కాంగ్రెస్‌కు హక్కు లేదని..ఆ పార్టీ వరుసగా ఓడిపోతోందని ఆయన చెబుతున్నారు.
ఆయన ఇప్పుడు మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్‌నే అసలైన కాంగ్రెస్‌గా ప్రజెంట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తనకు మాత్రమే సాధ్యమైన విచ్చిన్నకర రాజకీయాలతో తృణమూల్ చాలా బలంగా ఉందని నిరూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయనను నమ్మిన మమతా బెనర్జీ కూడా కాంగ్రెస్ పార్టీని బలహీనం చేసేందుకు తన వంతు ప్రయత్నం చేస్తోంది. ఇదంతా ప్రశాంత్ కిషోర్ గేమ్ అని ఆమె గుర్తించడం లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయంగా వెలిగిపోవాలనుకున్నారు. కానీ అక్కడ ఆయనకు రెడ్ కార్పెట్ లభించలేదు.
దీంతో తనకు కావాల్సిన స్థానం మమతా బెనర్జీ ఇస్తుందని ఆ పార్టీకే ఫుల్ టైం పని చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ లేకపోతే బీజేపీని ఓడించలేమన్న వాదనను మర్చిపోయి.. కాంగ్రెస్‌తో పని లేదన్నట్లుగా మాట్లాడటం ప్రారంభించారు. అంతే కాదు కాంగ్రెస్ మీద మాటల దాడి చేస్తున్నారు. నిజానికి కాంగ్రెస్ పరిస్థితి మెరుగ్గా ఉందని ఎవరూ అనరు. ఆ పార్టీలో నాయకత్వం గొప్పగా పని చేయడం లేదని.. బీజేపీ నేతలు.. ఆ పార్టీ సానుభూతిపరులు విశ్లేషిస్తారు. అది పొలిటికల్ స్ట్రాటజీ.
ప్రత్యర్థి పార్టీలో ఎవరు బలంగా ఉంటే వారిని దెబ్బకొడితే ఆటోమేటిక్‌గా పార్టీ బలహీనమవుతుంది. అదే బీజేపీ వ్యూహాన్ని ఇప్పుడు ప్రాంతీయ పార్టీలను వాడుకుని కాంగ్రెస్‌పై ప్రయోగించి బీజేపీకి మేలు చేస్తున్నారు. ఆయన ఇటీవలి కాలంలో చేస్తున్న వ్యాఖ్యలన్నీ అంతే ఉన్నాయి.