నారా భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారాన్ని ముగించాలని వైసీపీ నేతలు బతిమాలుతున్నారు. వల్లభనేని వంశీ మీడియా చానళ్లను పిలిచి ప్రతి ఒక్క చానల్‌కు విడివిడిగా ఇంటర్యూలు ఇచ్చి క్షమాపణలు చెప్పారు. అయితే ఈ అంశాన్ని టీడీపీ పెద్దగా పరిగణనలోకి తీసుకోలేదు. అనాల్సినదంతా అని క్షమాపణ చెబితే సరిపోతుందా అని ఆ పార్టీ నేతలు అంతర్గత సంభాషణల్లో అనుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ అడుగడుగునా గౌవరసభలు నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో వైసీపీ ఎమ్మెల్యేలు రోజుకొకరు చొప్పున తప్పు చేశామని తెర ముంందుకు వస్తున్నారు.
తాజాగా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాదరరెడ్డి భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లుగా ఆమె భావించి బాదపడి ఉంటే.. కన్నీటితో కాళ్లు కడుగుతామని ప్రకటించి కలకలం రేపారు. వైసీపీ ఎమ్మెల్యేలందరూ ఆ పని చేస్తారన్నారు. వల్లభనేని వంశీ తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కాకపోయినప్పటికీ సహచర సభ్యునిగా బాధ్యత తీసుకుంటామని .. దయచేసి ఈ వివాదానికి ఇంతటితో ముగింపు పలకాలని కోరుతున్నారు.
వైఎస్.రాజశేఖర్ రెడ్డి సతీమణి విజయమ్మ అయినా.. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి అయినా తమందరికీ.. ఒకే గౌరవమని రాచమల్లు చెప్పుకొచ్చారు. ఎవరు ఏ మహిళను కించపరిచినా అది తప్పేనంటూ వ్యాఖ్యానించారు. ఆనాడు సత్యహరిశ్చంద్రుడు ఇచ్చిన మాటకోసం భార్యను చక్రవర్తి ఇంటికి పనికి పంపితే..ఈనాడు చంద్రబాబు నాలుగు ఓట్ల కోసం, తన భార్య శీలాన్ని బజారుకీడుస్తున్నాడని రాచమల్లు అంటున్నారు. టీడీపీ గౌరవసభలు నిర్వహిస్తే వైసీపీ ఎమ్మెల్యేలకు బాగా ఇబ్బందికరంగా ఉన్నట్లుగా ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.