ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఇటీవలి కాలంలో తన వారంతపు ఆర్టికల్ కొత్తపలుకులో కొత్త విషయాలేమీ చెప్పడం లేదు. గతంలో కాస్త “ఇన్ సైడ్”గా జరిగే ఆసక్తికర వార్తలను అన్యాపదేశంగా అయినా చెప్పేవారు. ఇటీవల అలాంటివి తగ్గిపోయాయి. నేరుగా ఆంధ్రప్రదేశ్ సీఎం పాలన ఎంత దారుణంగా ఉందో చెప్పడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఏమీ జరగకపోయినా అవాస్తవాలతో ఊరూరా తిరిగి ప్రచారం చేసిన కొంత మందిని నేరుగా టార్గెట్ చేసుకుంటున్నారు. గత వారం అలాగే చేశారు. ఈ వారం కూడా అలాగే చేసుకున్నారు. వీరంతా ఎందుకు నోరు మెదపడం లేదని అని ప్రశ్నిస్తున్నారు.
ఆయన అలా అనడం వల్ల టెంప్ట్ అయ్యారో లేకపోతే నిజంగానే జగన్‌కు మద్దతు పలికి రాష్ట్రం ఇక్కట్లలో పడటానికి కారణం అయ్యానని ఫీల్ అవుతున్నారో కానీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఇటీవల జగన్ పాలనపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయన ఒక్కరే రియలైజ్ అయ్యారని మిగతా వారి సంగతి ఏమిటని ఆర్కే ప్రశ్నిస్తున్నారు. టీడీపీ ఉన్నప్పుడు ఉద్యమాలు చేసి ఇప్పుడు పదవులు తీసుకుని సైలెంటయిపోయిన వారి పేర్లను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఒత్తిడి పెంచే ప్రయత్నాన్ని ఆర్కే కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా పార్టీలతో సంబంధం లేదని చెప్పి… చంద్రబాబు ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు చేసి… ఇప్పుడు పదవులు అనుభవిస్తున్న వారిని ఆర్కే టార్గెట్‌గా చేసుకున్నట్లు కనిపిస్తోంది.
ఈ వారం ఆర్టికల్‌లో మొత్తంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి రెండున్నరేళ్ల పాలనను రివ్యూ చేశారని అనుకోవచ్చు. రెండున్నరేళ్లకే ఏపీ సర్వనాశనం అయిపోయిందని… తేల్చేశారు. సీఎం జగన్ కూడా 151సీట్లతో అధికారంలోకి వచ్చి తీవ్ర స్థాయి వ్యతిరేకత మూటగట్టుకున్నారని తేల్చారు. అంత వ్యతిరేకత ఆయన స్వయంకృతమేనన్నారు. జగన్ తీసుకున్న ఏ నిర్ణయంపైనా నిలబడలేకపోయారని.. ఎన్ని సార్లు మాట తప్పారో.. ఎన్ని సార్లు మడమ తిప్పారో అంచనా వేయడం కష్టమని తేల్చేశారు.
ఎలా చూసినా ఇంకా జగన్మోహన్ రెడ్డిసర్కార్‌కు రెండున్నరేళ్ల గడువు ఉంది. ఇప్పటికే జగన్ సర్కార్‌పై తీవ్రమైన వ్యతిరేకత ఉందని భావిస్తున్న ఆర్కే… గతంలో రావాలి జగన్ అంటూ పాడిన వారితోనే ఇప్పుడు పోవాలిజగన్ అని అనిపించాలన్న పట్టుదలతో ఉన్నట్లుగా కనిపిస్తోంది. అందుకే ఆయన ప్రతీ వారం.. జగన్ కోసం గతంలో టీడీపీ ప్రభుత్వంపై నిందలేసిన అందరినీ గుర్తు చేసుకుటున్నారు. ఆయన ప్రయత్నాలు సక్సెస్ అయితే.. జగన్ రావాలని కోరుకున్న వారే పొమ్మంటున్నారన్న అభిప్రాయం ఏర్పర్చడానికి అవకాశం ఏర్పడుతుంది.