అన్నమయ్య ప్రాజెక్ట్ ఘోరానికి రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతేనని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ సింగ్ షెకావత్ రాజ్యసభలో ప్రకటించడం సంచలనం రేపుతోంది. తమ బాధ్యతేమీ లేదని.. అంతా ప్రకృతి తప్పేనని ప్రభుత్వం వాదిస్తోంది. అయితే షెకావత్ అలా ప్రకటించిన తర్వాత ఏపీ ప్రభుత్వానికి ఎలా సమర్థించుకోవాలో తెలియలేదు. వెంటనే అనిల్ కుమార్ మీడియా ముందుకు వచ్చి అలవాటైన పద్దతిలో టీడీపీకి అంటు కట్టేశారు. షెకావత్ ప్రకటన చేస్తున్న సమయంలో సీఎం రమష్ టీవీ స్క్రీన్లలో రెండు వరుసల వెనుక ఉన్నట్లుగా కనిపిస్తూ ఉన్నారు. ఆయన రాజ్యసభ సభ్యుడు కాబట్టి రాజ్యసభలో ఉన్నారు. బీజేపీ సభ్యుడు కాబట్టి బీజేపీ సభ్యుల వరుసలో ఉన్నారు.
అయితే ఏదో ఓ లింక్ పెట్టడానికి ఇంత కన్నా గొప్ప అవకాశం దొరకదని అనుకున్నారేమో కానీ అనిల్ కుమార్ అదిగో అక్కడ సీఎంరమేష్ ఉన్నాడు.. సుజనా చౌదరి ఉన్నాడు.. వాళ్లే ఈ పిట్ట కథ చెప్పించి ఉంటారని సెటైర్లు వేశారు. ఈ విమర్శలు వెంటనే బీజేపీ హైకమాండ్ దృష్టికి వెళ్లినట్లుగా తెలుస్తోంది. వైసీపీ నేతలు ఎవరు ఎన్ని మాటలన్నా సైలెంట్‌గా ఉండే బీజేపీ నేతలు ఒక్క సారిగా రెచ్చిపోయారు. ప్రధానమంత్రి మోడీని వైసీపీ నేతలు విమర్శించినా రచ్చ అయిన తర్వాత తీరిగ్గా..టీడీపీతో లింక్ పెట్టి విమర్శలు చేసే జీవీఎల్ నరసింహారావు వెంటనే స్పందించారు. అనిల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మిగిలిన నేతలు కూడా కాస్త ఘాటుగానే స్పందించారు.
నిజాలు చెబుతూంటే అంత ఉలుకెందుకని మండిపడ్డారు. మూడు రోజుల పాటు కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటించింది. వారు ఇచ్చిన నివేదిక.. వరద..వాన నివేదికలు అక్కడి అధికారులు తీసుకున్న చర్యలు అన్నింటినీ పరిశీలించి.. నివేదిక ఇచ్చారని.. దాన్ని చూసే షెకావత్ మాట్లాడారని అంటున్నారు. ఇప్పుడు వారి నివేదికను బయట పెట్టి కేంద్రం విచారణ జరిపితే ప్రభుత్వం అడ్డంగా ఇరుక్కుపోతుంది. అనిల్‌కుమార్‌కూ ఇక్కట్లు తప్పవని అంటున్నారు.