ఫర్ సప్పోజ్.. రాజమౌళి వెళ్లి ప్రభాస్‌కు బాహుబలి కథ వినిపించిన తర్వాత… అందులో చిన్న చిన్న మార్పు చేర్పులు చేస్తే బాగుంటుందంటూ ప్రభాస్ సూచనలు చేస్తే ఎలా ఉంటుంది? శషబిషలేం అక్కర్లేదు. కచ్చితంగా బాగానే ఉంటుంది. ఎందుకంటే అది జానపద కథగా వండినదే గనుక.. హీరో తన ఆలోచనలను పంచుకుంటే పరవాలేదు. అయితే రాజమౌళి మహాభారతం కథ చెప్పిన తర్వాత.. అందులో కూడా ప్రభాస్ కొన్ని సీన్లు, కథాగమనం మార్చేద్దాం అంటూ సలహా ఇచ్చాడనుకోండి.. చాలా వెటకారంగా ఉంటుంది. చాలా అహంకారంగా కూడా ఉంటుంది. అలాంటి అహంకారం హీరోగా మారడానికి నానా తంటాలు పడుతున్న కమెడియన్ సునీల్‌కు పుష్కలంగా ఉన్నదని ఇండస్ట్రీలో పలువురు అంటుంటారు. అహంకారంతో తనకు అందివచ్చిన అపురూపమైన అవకాశాలను కాలదన్నుకున్న ఫలితమే.. ఇప్పుడిలా కృష్ణాష్టమి లాంటి ఫ్లాపుల్లో మునిగితేలవలసిన దుస్థితి అని ఇండస్ట్రీలో కామెంట్లు వినిపిస్తున్నాయి.
దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..
సునీల్‌కు గతంలో ఒక మంచి అవకాశం వచ్చింది. సునీల్ హీరోగా భక్తకన్నప్ప చిత్రం చేయడానికి దర్శకుడు తనికెళ్ల భరణి సిద్ధమయ్యారు. సునీల్‌కు కథ కూడా చెప్పారు. అయితే సునీల్ సదరు భక్తకన్నప్ప కథను తన హీరోయిజానికి అనుకూలంగా మార్చాలంటూ కొన్ని నిబంధనలు పెట్టాడుట.
అసలు భక్తకన్నప్ప అంటేనే చారిత్రక జానపద నేపథ్యపు కథ! మూగజీవులకు ముక్తిని ప్రసాదించిన శ్రీకాళహస్తీశ్వరుడికే కంటిని దానంచేసిన మహాభక్తుడి కథ. పాతకాలంలో ఈ భక్త కన్నప్ప చిత్రంలో అప్పటి రెబెల్‌స్టార్ కృష్ణం రాజు నటించి.. ఎంత ఖ్యాతి సంపాదించారో అందరికీ తెలుసు. అలాంటి అపురూపమైన కథను.. రచయితగా విఖ్యాతి, దర్శకుడిగా తనదైన ముద్ర కలిగి ఉన్న తనికెళ్ల భరణి.. ఒక డ్రీం ప్రాజెక్టుగా రూపొందించదలచుకున్నారు. పైగా ఆయన అపరిమితమైన శివభక్తుడు అన్న సంగతి అందరికీ తెలిసిందే.
ఆ కథలో శ్రీకాళహస్తి ప్రాంతానికే చెందిన హీరో విష్ణు నటిస్తాడని తొలుత వార్తలు వచ్చినా.. తర్వాత హీరో సునీల్ చేస్తాడంటూ ప్రచారం జరిగింది. భరణి కథ విన్న సునీల్ కన్నప్పలో తన హీరోయిజం ఎలివేట్ అయ్యే మార్పులు కొన్ని సూచించాడుట. పురాణాల ఆధారంగా తీసే ఈ కథలో సునీల్ స్టయిల్ మార్పులు చేయడానికి మనస్కరించక తనికెళ్ల భరణి ఆ ఆలోచన మానుకున్నారు. తూచ్ అనేసిన సునీల్ ప్రస్తుతం థియేటర్లలో ఉన్న కృష్ణాష్టమి చిత్రం చేశాడు. పురాణ కథలకు కూడా తనదైన మార్పులు చెప్పగలస్థాయి అహంకారం ఉన్న సునీల్ వైఖరే.. ఆయనకు మంచి చిత్రాలు దూరం చేసి ఇలాంటి ఫ్లాప్‌లను కట్టబెట్టిందని ఇప్పుడు ఇండస్ట్రీలో జనం గుసగుసలాడుకుంటున్నారు.