పార్లమెంట్ సమావేశాలు తొలి నాలుగు రోజులు పార్లమెంట్ టీఆర్ఎస్ ఎంపీలు చేసిన ఆందోళనలు హైలెట్ అయ్యాయి. వరి ధాన్యం కొనుగోలుపై చేయాల్సిన రచ్చ అంతా చేశారు. ఈ వారం మరింత దూకుడుగా ఉంటారేమో అని అనుకున్నారు. కానీ అసలు ఎంపీలు పార్లమెంట్‌కు వెళ్లవద్దని కేసీఆర్ సూచించినట్లుగా తెలుస్తోంది. దీనికి కారణం బియ్యంపై పోరాటంలో కేంద్రం పట్టించుకోకపోవడమో. ..లేక అనుకున్న ఫలితం సాధించామనో కాదు.. దడ పుట్టిస్తున్న ఎమ్మెల్సీ ఎన్నికలు. ఎమ్మెల్సీలకు ఎన్నికలు జరుగుతున్న చోట ఉన్న ఎంపీలు.. ఎన్నికలపైనే దృష్టి పెట్టాలని ఆదేశించినట్లుగా తెలుస్తోంది.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థుల గెలుపు బాధ్యతను కేసీఆర్ ఎంపీలకు ఇచ్చారు. ఇప్పటికే నలుగురు ఎంపీలు ఓటర్లతో నిర్వహిస్తున్న క్యాంప్‌లకు వెళ్లారు. ప్రతి ఓటు కీలకం కావడంతో క్రాస్ ఓటింగ్ జరుగకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను అధికార పార్టీతో పాటు ఇండిపెండెంట్లు, కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. కొన్ని జిల్లాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ, కౌన్సిలర్లు సైలెంట్ అయ్యారు. దీంతో ఏం జరుగుతోందనని టీఆర్ఎస్ లో ఆందోళన నెలకొంది.
నల్లగొండ, ఖమ్మం, ఆదిలాబాద్, మెదక్ లో ఒక్కొక్క స్థానానికి, కరీంనగర్ లో రెండు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఇప్పటికే నల్లగొండ జిల్లా తప్ప మిగిలిన నాలుగు జిల్లాలకు చెందిన స్థానిక సంస్థల సభ్యులు గోవా, ఢిల్లీ, బెంగళూరు క్యాంపులకు వెళ్లారు. మెజార్టీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు టీఆర్ఎస్ కు చెందినవారే. అయితే వారిలో అసంతృప్తి ఉంది. నిధులు, విధుల విషయంలో వారిని సంతృప్తి పరచడం కష్టంగా మారింది. పోలింగ్ కు మరో నాలుగు రోజులు గడువు ఉండటంతో పోలింగ్ ముగిసిన తర్వాతే ఎంపీలు పార్లమెంట్‌కు వెళ్లే అవకాశం కనిపిస్తోంది.