‘భారతదేశం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రపంచమంతా ఇప్పుడు భారత్ వైపే చూస్తోంది,’ వంటి మాటలు తరచూ వింటుంటాము. కానీ నేటికీ కులాలు, మతాల పేరిట దేశంలో ఏదో ఒక ప్రాంతంలో నిత్యం గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఆంధ్రాలో కాపులు రిజర్వేషన్లు కోరుతూ రైలును, పోలీస్ వాహనాలను తగులబెడితే, హర్యానా రాష్ట్రంలో ‘జాట్’ కులస్తులు రైల్వే స్టేషన్, రాష్ట్ర ఆర్ధిక మంత్రి ఇంటిని, ప్రభుత్వ, ప్రైవేట్ భవనాలకు, వాహనాలకు, హిస్సార్ జిల్లాలో రెండు టోల్ గేట్లకు నిప్పు పెట్టారు.
చిన్నగా ప్రారంభమయిన జాట్ ల ఉద్యమం ఇప్పుడు రాష్ట్రంలో తొమ్మిది జిల్లాలకు వ్యాపించి ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఆ జిల్లాలో కర్ఫ్యూ విధించబడింది. పరిస్థితి అదుపు తప్పడంతో ఆర్మీ రంగ ప్రవేశం చేసి రోహ్తక్, భివాని ప్రాంతాలలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించింది. అయినప్పటికీ ఆందోళనకారులు ప్రభుత్వ, ప్రైవేట్ భవనాలకు, వాహనాలకు నిప్పు పెడుతూనే ఉండటంతో పోలీసులకి ‘షూట్ ఎట్ సైట్’ ఆదేశాలు జారీ చేయబడ్డాయి. ఆందోళనకారులు రాష్ట్రంలో ప్రధాన రహదారులను అన్నిటినీ దిగ్బంధం చేయడంతో పోలీసులు, సైనికులను ఆయా ప్రదేశాలకు తరలించదానికి హెలికాఫ్టర్లు వినియోగిస్తున్నారు.
ఈరోజు కొందరు ఆందోళనకారులు జింద్ జిల్లాలోని బుధా ఖేరా రైల్వే స్టేషన్ కి నిప్పు పెట్టారు. ప్రభుత్వం తమకు రిజర్వేషన్లు కల్పిస్తామని లిఖిత పూర్వకంగా హామీ ఇచ్చేవరకు తమ ఉద్యమం కొనసాగుతుందని ఒక ఆందోళనకారుడు చెప్పాడు. ప్రస్తుతం పరిస్థితి అడుపులోక్ వచ్చినట్లు కనిపిస్తున్నప్పటికీ ఆందోళనకారులు ఎక్కడో ఒకచోట ప్రభుత్వ, ప్రవితే వాహనాలకు నిప్పు పెడుతూనే ఉన్నారు.
తమ ఉద్యమాన్ని దెబ్బ తీసేందుకే ఎవరో ఇటువంటి పనులకు పాల్పడుతున్నారని, తాము హింసకు వ్యతిరేకమని జాట్ ఆందోళనకారులు చెపుతున్నారు. జాట్ లు ఆందోళన విరమించితే చర్చలకు సిద్దమని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ ఖత్తర్ చేస్తున్న విజ్ఞప్తిని ఆందోళనకారులు అసలు పట్టించుకోవడం లేదు. కనుక పరిస్థితులను పూర్తిగా అదుపులో తెచ్చే బాధ్యత పోలీసులు, ఆర్మీ జవాన్లపైనే పడింది. కేంద్ర హోమ మంత్రి రాజ్ నాథ్ సింగ్, రాష్ట్ర ముఖ్యమంత్రి, గవర్నరుతో మాట్లాడుతూ పరిస్థితులను పర్యవేక్షిస్తూ అవసరాన్ని బట్టి కేంద్ర బలగాలను రాష్ట్రానికి పంపిస్తున్నారు.