రామాయణ, మహా భారత గాధల్ని ఎన్నిసార్లు చెప్పినా – అందులో ఏదో ఓ కోణం మిగిలే ఉంటుంది. ఆఖరికి కమర్షియల్ సినిమాలు కూడా అందులో పాయింట్లు తీసుకుని, వాటి ఆధారంగా రూపొందించినవే. ఇప్పటి ఆధునిక పరిజ్ఞానంతో రామాయణ, మహాభారత గాథల్ని తీస్తే… మరింతగాజనాలకు చేరువ అవుతుందన్నది దర్శక నిర్మాతల నమ్మకం. అందుకే.. రాజమౌళి మహాభారతం పై దృష్టి పెట్టాడు. ఎప్పటికైనా మహాభారతం తీస్తానని ప్రకటించాడు. ఇప్పుడు రాజమౌళి గురువు.. రాఘవేంద్రరావు రామాయణం తీయడానికి రెడీ అయ్యారు.
రాఘవేంద్రరావు దర్శకత్వంలో రామాయణం రూపుదిద్దుకోనుంది. అయితే.. ఇది రామాయణంలో మరో కోణం. మొత్తం రామాయణ గాధని సీత కోణంలో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి `సీత చెప్పిన రామాయణం` అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు సమాచారం. ఈ సినిమాకి సంబంధించి కథ సిద్ధమైంది. దీన్ని పాన్ ఇండియా ప్రాజెక్టుగా తెరకెక్కించాలన్నది దర్శకేంద్రుడి సంకల్పం. రాముడు. లక్ష్మణుడు, హనుమంతుడు, రావణాసురుడు పాత్రలు చాలా కీలకం కాబట్టి. ఆయా పాత్రల్లో హీరోలే కనిపించబోతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతానికి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే అధికారిక వివరాలు బయటకు వస్తాయి.