ఈటల రాజేందర్ భూములు కబ్జా చేసినట్లుగా మెదక్ జిల్లా కలెక్టర్ తేల్చారు. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక సమర్పించడమే కాదు ప్రెస్ మీట్ పెట్టి కూడా మీడియాకు చెప్పారు. ఈటల రాజేందర్ భార్య జమున పేరు మీద ఉన్న జమున హ్యాచరీస్ ఏర్పాటు చేసిన భూముల్లో సీలింగ్ ల్యాండ్స్ ఉన్నట్లుగా మెదక్ కలెక్టర్ హరీశ్ ఆధ్వర్యంలోని కమిటీ తేల్చింది. పౌల్ట్రీ ఫాంకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనుమతి లేదని నిర్ధారించారు. మొత్తంగా మందికి చెందిన 76 ఎకరాల 30 గుంటల భూమిని దౌర్జన్యంగా లాక్కున్నట్లుగా తాము గుర్తించామని మెదక్ కలెక్టర్ ప్రకటించారు.
జమునా హేచరీస్ భూములు తమ నుంచి లాక్కుని వ్యవసాయం చేసుకోనివ్వట్లేదని దళితులు ఫిర్యాదు చేశారని.. దానిపైనే విచారణ జరిపి అప్పట్లో ప్రాథమిక నివేదిక ఇచ్చామన్నారు. 56 మంది అసైనీల భూములను కబ్జా చేసినట్లు తేలింది. అచ్చంపేట, హకీంపేట పరిధిలో అసైన్డ్ భూముల కబ్జా జరిగిందని కలెక్టర్ తేల్చారు. నిజానికి ఈటల రాజేందర్ మంత్రిగా ఉన్నప్పుడే.. కేసీఆర్ ఆదేశాల మేరకు ఒక్క రోజునే సర్వే చేసి నివేదిక కూడా ఇచ్చారు. అప్పుడే కబ్జా చేశారని నివేదిక ఇచ్చారు.
అయితే నిబంధనలు పాటించలేదని చెప్పి జమున హ్యాచరీస్ యాజమాన్యం హైకోర్టులో పిటిషన్ వేసింది. దీంతో ఆ నివేదికను కొట్టి వేసిన హైకోర్టు నిబంధనలకు అనుగుణగా నోటీసులు ఇచ్చి సర్వే చేయాలని ఆదేశించింది. అప్పట్లో సైలెంట్ అయిన అధికారులు హుజురాబాద్ ఉపఎన్నికల తర్వాత కార్యాచరణ ప్రారంభించారు. కలెక్టర్ నివేదిక ఆధారంగా ఈటల పౌల్ట్రీ ఫాంను కేసీఆర్ సర్కార్ గుంజుకుంటే రాజకీయం మరింత రంజుగా మారే అవకాశం ఉంది.