వైఎస్ జగన్మోహనరెడ్డి శనివారం మధ్యాహ్నం లంచ్‌బ్రేక్ సమయానికి తీవ్రమైన నిర్వేదానికి వచ్చారు. ‘మనం చేయగలిగిందంతా.. ఆయన స్థాయికి తగిన గౌరవం పార్టీ ఆయనకు కల్పించింది. ఆయనకు పీఏసీ ఛైర్మన్ పదవి కూడా కట్టబెట్టాం. అయినా అవకాశవాద రాజకీయాలు ప్రదర్శిస్తే మనం ఏమీ చేయలేం’ అంటూ ఆయన భూమా నాగిరెడ్డి తెదేపాలోకి చేరదలచుకోవడం మీద నిరాశాపూరితమైన వ్యాఖ్యలు చేశారు. కర్నూలు జిల్లా పార్టీ ఎమ్మెల్యేలతో సుదీర్ఘంగా సమావేశం అయిన జగన్.. చివరికి భూమా దిగిరావడం లేదని అర్థమైన తర్వాత.. ఆయన మీద అవకాశవాది ముద్ర వేసి ప్రస్తుతానికి ఈ ఎపిసోడ్‌కు ఫుల్‌స్టాప్ పెట్టదలచుకున్నారు. అంతవరకు బాగానే ఉంది. ఆయన పార్టీనుంచి గెలిచి ఫిరాయిస్తున్నాడు గనుక.. భూమాను ఏం అనడానికైనా ఆయనకు చెల్లుతుంది. అయితే ఇదంతా స్వయంకృతాపరాధమేనా…? ఇవాళ భూమాకు పీఏసీ పదవులు కూడా కట్టబెట్టానంటూ ఆయన అంటుండవచ్చు గాక.. కానీ భూమాతో రాజకీయ బంధాన్ని ఒక బిజినెస్‌డీల్‌గా తొలినుంచి వ్యాపారం చేసిన ఫలితమే.. ఇప్పుడిలా బెడిసికొట్టిందా అని పలువురు విశ్లేషిస్తున్నారు.
దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే…
భూమా కుటుంబం ఒకప్పట్లో తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా భూమా ఫ్యామిలీ తెలుగుదేశంలోనే ఉంది. ఆ సమయంలో రాష్ట్రంలో అనేక రకాల వ్యవహారాల్లో ముఖ్యమంత్రి తనయుడిగా జగన్ చక్రం తిప్పుతున్నారనే ప్రచారం ఉండేది. అలాంటి నేపథ్యంలో తెలుగుదేశానికి చెందిన భూమా నాగిరెడ్డి.. హైదరాబాదు నగర పరిసరాల్లోని ఒక ల్యాండ్ డీల్‌కు సంబంధించి.. జగన్ ఆశ్రయించాడనేది ఒక పుకారు. ప్రభుత్వం పరంగా దానికి అనుమతులు కావాలనేది ఆయన అప్పటి అవసరం. అయితే తెదేపా నాయకుడికి పనిచేసి పెడితే.. చెడ్డపేరు వస్తుందని వైఎస్ రాజశేఖరరెడ్డి అడ్డు పడ్డారనేది ఒక పుకారు. సదరు ల్యాండ్ డీల్ కోసం భూమా తెదేపాను వీడడానికి కూడా సిద్ధపడ్డారు గానీ.. కాంగ్రెసులో చేర్చుకోవడానికి స్థానిక సమీకరణాలు కుదరడం లేదని వైఎస్సార్ నో చెప్పినట్లుగా పుకార్లు అప్పట్లో వినిపించాయి. పర్యవసానంగా భూమా తెలుగుదేశాన్ని వీడి అప్పుడే పుట్టిన ప్రజారాజ్యంలో చేరేట్లుగా, ఆ తర్వాత.. ల్యాండ్ అనుమతుల డీల్ యధావిధిగా జరిగే విధంగా ఒప్పందం కుదిరిందని అనుకుంటూ ఉండేవారు.
స్కెచ్ మొత్తం అనుకున్నట్లే జరిగింది. భూమా ప్రజారాజ్యంలోకి వెళ్లారు. ఆయనకు కావాల్సిన పని జరిగింది. దానికి సంబంధించి జగన్‌తో ఒప్పందం ప్రకారం డీల్ కూడా పూర్తయిందని ప్రచారం.
ఆతర్వాతి అనూహ్య పరిణామాల్లో వైఎస్సార్ దుర్మరణం పాలవడం, జగన్ సొంత పార్టీ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడడం జరిగింది. ఈలోగా చిరంజీవి ప్రజారాజ్యాన్ని కాంగ్రెసులో కలిపేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో భూమా నాగిరెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి వచ్చారు. ఎటూ స్వతహాగా కర్నూలు జిల్లాలో బలమైన నాయకుడు కావడానికి తోడు, జగన్‌తో బంధుత్వం కూడా ఉన్నందున.. పార్టీలో కీలక నేతగా ఎదిగారు. ఆ రకంగా జగన్‌తో భూమా నాగిరెడ్డి రాజకీయ బంధం అనేది ఒక వ్యాపార డీల్ ఆధారంగానే ప్రారంభం అయినట్లుగా అప్పట్లో ముమ్మరంగా పుకార్లు నడిచాయి.
అధికారం తన చేతిలో ఉన్నప్పుడు, తన తండ్రి సీఎంగా చెలాయిస్తున్నప్పుడు.. రాజకీయాలను బిజినెస్ డీల్స్‌గా మార్చేసిన ఫలితమే ఇప్పుడు ఎలాంటి ‘ఎటాచ్‌మెంట్’ లేకుండా తనంత తాను వెళ్లిపోవడానికి భూమా నాగిరెడ్డి నిర్ణయించుకోవడానికి కారణం అని కూడా పలువురు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికైనా జగన్ తన పద్ధతి మార్చుకుని రాజకీయాలను బిజినెస్ డీల్స్‌గా చూడడం మానేస్తే పార్టీకి భవిష్యత్తు బాగుటుందని పలువురు సూచిస్తున్నారు.