అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోయిన విషాదం వెనుక తప్పిదం ఎవరిదో తేల్చి శిక్షించాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని చెప్పిన కేంద్ర మంత్రి షెకావత్‌పై వైసీపీ నేతలు దారుణమైన విమర్శలు చేయడంతో బీజేపీ హైకమాండ్‌కు అనేక ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో వెంటనే అన్నమయ్య ప్రాజెక్ట్ విషాదానికి కారణం ఏమిటో తేల్చేందుకు ప్రత్యేకంగా కమిటీని నియమించాలని కేంద్ర జలశక్తి శాఖ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. రికార్డులు పరిశీలించి.. క్షేత్ర స్థాయిలో పర్యటించి ఈ కమిటీ నివేదిక ఇవ్వనుంది.
అన్నమయ్య ప్రాజెక్ట్ విషాదం వెనుక వ్యక్తుల స్వార్థం ఉందన్న అభిప్రాయం బలంగా ఉంది. ఇసుక మాఫియా కోసం నీరు దిగువకు విడుదల చేయలేదన్న వాదన ఉంది. అదే సమయంలో కేంద్రం నుంచి .. ఎంత ఎంత వర్షం పడుతుంది.. ఎగువ నుంచి ఎంత ఎంత వరద వస్తుందన్న దానిపై స్పష్టమైన సమాచారం ఉంది.అధికారలకు ఎప్పటికప్పుడు సమాచారం అందింది. దాని ప్రకారం నీటిని దిగువకు విడుదల చేయడంలో విఫలమయ్యారు. అదే సమయంలో పని చేయని ఐదో గేటు అంశం కూడా హాట్ టాపిక్ అవుతోంది. దానికి ఏడాది కిందటే మరమ్మతులు చేయాలని తేల్చినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇది కూడా ఘోర తప్పిదమే. ఇవన్నీ కేంద్ర బృందం వచ్చి పరిశీలన చేస్తే తేలిపోతాయి.
కేంద్ర బృందం వస్తే ఇరుక్కుపోతామని భావిస్తున్న ప్రభుత్వం హడావుడిగా రెండు కమిటీల్ని నియమించింది. ఒకటి చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో.. మరొకటి సాంకేతిక ఉప కమిటీ. ఇప్పటి వరకూ ప్రభుత్వం నిర్మోహమాటంగా అది ప్రకృతి విపత్తే కానీ.. ప్రభుత్వానికి ఏం సంబంధం లేదని చెబుతూ వస్తోంది. కానీ కేంద్రం కమిటీ నియమిస్తోందని తెలిసిన తర్వాత వెంటనే.. రెండు కమిటీల్ని నియమించింది. కేంద్ర కమిటీకి వీలైనంత వరకూ పరిమితులు పెట్టడమే ఈ కమిటీల నియామకం లక్ష్యమని భావిస్తున్నారు.
కొద్ది రోజులుగా అన్నమయ్య ప్రాజెక్ట్ విషాదంపై రాజకీయం నడుస్తోంది.తప్పిదం ఎవరిదో తేల్చాలన్న డిమాండ్లూ వినిపిస్తున్నాయి. కేంద్రం ఈ విషయంలో సీరియస్‌గా ఉంటే.. పదుల సంఖ్యలో ప్రాణాలు పోవడానికి కారణమైన వారికి సరైన శిక్ష పడేఅవకాశం ఉంది. అదే జరిగితే .. మళ్లీ మళ్లీ ఇలాంటి తప్పు జరగకుండా ఉంటాయి.