జర్నలిస్టుల సంక్షేమంలో మాటలు చెప్పడం కన్నా అంతో ఇంతో ఆచరణలో చూపిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. గతంలో కరోనా బారిన పడిన జర్నలిస్టులకు రూ. ఇరవై వేల చొప్పున ఇచ్చిన ప్రభుత్వం.. ఆ మహమ్మారి బారిన పడి చనిపోయిన వారి కుటుంబాలకూ అండగా ఉంటోంది. కరోనాతో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ. రెండు లక్షలు.. ఇతర కారణాలతో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించారు. పదిహేనో తేదీన ప్రత్యేకంగా కార్యక్రమం ఏర్పాటు చేసి చెక్కులను పంపిణీ చేయనున్నారు.
జర్నలిస్టులు అందరికీ ఉపయోగపడే సంక్షేమ కార్యక్రమాల విషయంలో తెలంగాణ సర్కార్ కాస్తంత నిజాయితీగానే ఉంటోంది. డెస్క్ జర్నలిస్టులు సహా అందరికీ అక్రిడేషన్లు.. హెల్త్ కార్డులు కూడా ఇచ్చింది. కరోనా బారిన పడిన వారికి తక్షణ సాయం చేసింది. ఈ విషయంలో మీడియా అకాడమీ చైర్మన్‌గా ఉన్న అల్లం నారాయణ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించి విడుదల చేయిస్తున్నారు. దీర్ఘ కాలంగా ఉన్న హౌసింగ్ సొసైటీ సమస్య పరిష్కారం గురించే ఎక్కువ మంది మాట్లాడుతూంటారు కానీ ఇతర సంక్షేమం విషయంలో జర్నలిస్టుల విషయంలో తెలంగాణ సర్కార్ మెరుగ్గా వ్యవహరిస్తోందని చెప్పువచ్చు.
ఏపీ ప్రభుత్వం వైపు నుంచి కూడా ఇలాంటి సంక్షేమాన్నే ఆశిస్తున్నారు. కరోనా బారిన పడిన వారికి అక్కడి ప్రభుత్వం పైసా సాయం చేయలేదు. కరోనాతో చనిపోయిన వారికి రూ. ఐదు లక్షలు ఇస్తామన్న జీవో మాత్రం విడుదల చేశారు. కానీ ఇచ్చారో లేదో స్పష్టత లేదు. ఒక వేళ ఇస్తే.. తెలంగాణకు చెంది కూడా అక్కడి ప్రభుత్వానికి సలహాదారులుగా ఉన్న అమర్ లాంటి పెద్ద మనుషులు భారీ కార్యక్రమం పెట్టి సీఎంను వేనోళ్ల పొగిడి ఆ చెక్కులు ఇచ్చి ఉండేవారు. అంటే ఇవ్వలేదనుకోవాలి.