2024 తర్వాత రిటైర్మెంట్ తీసుకుంటానని సోము వీర్రాజు ప్రకటించడం ఆ పార్టీలోనే చర్చనీయాంశంగా మారింది. తాను 42 ఏళ్లుగా రాజకీయం చేస్తున్నానని వచ్చే ఎన్నికల తర్వాత రాజకీయాల్లో ఉండబోనని ఆయన తేల్చి చెప్పారు. ఇంత హఠాత్తుగా ఎందుకు నిర్ణయం తీసుకున్నారో కానీ.. ఆయన బీజేపీని గెలిపించే రాజకీయాల నుంచి వైదొలుగుతా అన్నట్లుగా మాట్లాడారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అధికారం ఇవ్వాలని ఏపీ ప్రజలను కోరారు. భారతీయ జనతా పార్టీకి పాలించే సత్తా ఉందన్నారు.
సోము వీర్రాజు ప్రకటనను బీజేపీ వర్గాలు ఓ వ్యూహాత్మకమైన ప్రకటనగా భావిస్తున్నాయి. ఆయన విరమించుకుంటారంటే.. ఆయనకు సానుభూతితో ప్రజలు ఒక్క చాన్స్ ఇస్తారన్న అంచనాతో ఇలాంటి ప్రకటన చేశారని అనుకుంటున్నారు. అయితే ఇతర పార్టీల నేతలు మాత్రం ఆయనకు విరక్తి పుట్టిందని.. అంటున్నారు. టీడీపీ పుణ్యంతో వచ్చిన ఎమ్మెల్సీ పదవి కాలం పూర్తయింది. ఈ మధ్య కాలంలో మరో పదవి వస్తుందన్న నమ్మకం లేదు. తాను ఏపీ బీజేపీ అధ్యక్షునిగా ఉండి వైసీపీకి పార్టీని తాకట్టు పెట్టేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈక్రమంలో ఆయనకు నిర్ణయాల శక్తి లేకుండా కోర్ కమిటీని హైకమాండ్ నియమించింది.
ఈ ఫ్రస్ట్రేషన్ అంతా ఆయన ఇలా తీర్చుకుంటున్నారని అంటున్నారు. నిజానికి ఆయన తన నిర్ణయం చెప్పిన ప్రెస్మీట్లో వైసీపీ నేతలను తీవ్రంగా విమర్శించారు. అదే సమయంలో తన అలవాటును కూడా వదిలి పెట్టలేదు. ముందుగా చంద్రబాబును.. టీడీపీని విమర్శించిన తర్వాతే.. వైసీపీని విమర్శించారు. అందుకే ఎవరూ ఆయన వైసీపీని విమర్శించినవి సీరియస్గా తీసుకోలేదు కానీ.. ఆయన రిటైర్మెంట్ ప్రకటనను మాత్రం హైలెట్ చేస్తున్నారు. ఆయన ఏం మాట్లాడినా పెద్దగా పట్టించుకోని మీడియా ఆయన రాజకీయాల నుంచి విరమించుకుంటున్నారంటే భారీగా ప్రాధాన్యం ఇవ్వడం వీర్రాజుకు కూడా షాక్ ఇచ్చి ఉంటుందన్న గుసగుసలు ఆ పార్టీలోనే వినిపిస్తున్నాయి.