ఏపి రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.25,000 కోట్లు మాత్రమే ఇచ్చేందుకు అంగీకరించింది. సింగపూర్ నిర్మాణ సంస్థలు అంచనా ప్రకారం కనీసం రూ.1-1.25లక్షల కోట్లకు పైగా వ్యయం అవుతుంది. కనుక స్విస్ చాలెంజ్ విధానంలో రాజధాని నగరాన్ని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకొన్న విషయం తెలిసిందే. అయితే రాజధాని నిర్మాణానికి అవసరమయిన పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చిన సింగపూర్ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వానికి విధించిన కొన్ని షరతుల కారణంగా ఇంతవరకు పనులు మొదలుకాలేదు. వాటిలో రాష్ట్ర ప్రభుత్వానికి చాలా ఇబ్బందికరమయిన రెండు షరతులను సింగపూర్ సంస్థలు ఉపసంహరించుకోవడంతో మళ్ళీ ఈ వ్యవహారంలో కదలిక వచ్చినట్లయింది.
వాటిలో మొదటి షరతు: రాజధాని భూ కేటాయింపుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి హక్కు, పాత్ర ఉండకూడదు. రెండవ షరతు: ఒక సంస్థకు భూమిని కేటాయిస్తే దానికి 25కిమీ పరిధిలో ఎక్కడా అటువంటి మరొక సంస్థకు భూమిని కేటాయించకూడదు.
మొదటి షరతు విషయంలో సింగపూర్ సంస్థలు ఇప్పుడు ప్రభుత్వానికి కూడా భూకేటాయింపుల విషయంలో సమాన హక్కులుకలిగి ఉండేందుకు అంగీకరించాయి. భూమి ధర నిర్ణయం, కేటాయింపులు వగైరా వ్యవహారాల కోసం సింగపూర్ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులతో కూడిన ఒక ప్రత్యేక కమిటీ వంటిదానిని ఏర్పాటు చేసుకొని దాని ద్వారా తగిన నిర్ణయాలు తీసుకోవడానికి అంగీకరించింది. అలాగే రెండవ షరతుని పూర్తిగా ఉపసంహరించుకొంది. మరికొన్ని ఇబ్బందికర షరతులపై ఇరు వర్గాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. సింగపూర్ సంస్థలకు వాటి గురించి కూడా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని మార్పులు చేర్పులు సూచించింది. వాటిపై కూడా ఇరు పక్షాలకి అంగీకారం కుదిరినట్లయితే, ఒప్పంద పత్రాలపై సంతకాలు చేస్తాయి. ఆ తరువాతే రాజధాని నిర్మాణ పనులు మొదలుపెట్టవచ్చును. బహుశః ఈ వ్యవహారాలన్నీ ఒక కొలిక్కి వచ్చేసరికి మరొక రెండు మూడు నెలలు పడుతుందేమో? అంటే జూన్ లేదా జూలై నెలలో నిర్మాణ పనులు మొదలవుతాయని ఆశించవచ్చును. ఈ లోగా కేంద్రం నుండి అవసరమయిన అనుమతులు సాధించుకోవడానికి సమయం సరిపోతుంది.