పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీలు ఎందుకు ఆందోళన చేశారు..? . ధాన్యం కొనుగోళ్ల విషయంలో క్లారిటీ ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు. మరి ఎందుకు విరమించారు..? ఎందుకు అసలు సభకే డుమ్మా కొట్టాలనుకున్నారు..? ఇది మాత్రం ఎవరికీ తెలియదు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం టీఆర్ఎస్ ఎంపీల ఆందోళనలు.. విరమణ వెనుక ఉన్నది ఈడీ నోటీసుల వ్యవహారమని అంటున్నారు. కేసీఆర్ మనీలాండరింగ్‌కు పాల్పడినట్లుగా కేంద్రం వద్ద ఆధారాలున్నాయని.. ఈడీ నోటీసులు పంపిస్తారని తెలిసిన తర్వాతే ఆయన ఎంపీలను ఆందోళనలకు రెచ్చగొట్టారని అంటున్నారు.
కేంద్రంతో ఓ ఒప్పందం చేసుకుని ఈడీ నోటీసులు రావు అనిక్లారిటీ తీసుకున్న తర్వాత ఎంపీల ఆందోళలను విరమింప చేశారని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రైతుల పేరుతో బీజేపీ,కేసీఆర్ డ్రామాలాడారని అంటున్నారు. అయితే రేవంత్ రెడ్డి ఆరోపణలు అంత తేలిగ్గా తీసి పడేయాల్సినవి కావన్న అభిప్రాయం తెలంగాణ రాజకీయవర్గాల్లో ఉంది. ఎందుకంటే .. కేసీఆర్ వరుసగా ప్రెస్మీట్లు పెట్టడం ప్రారంభించినప్పటి నుండి ఆయన ఈడీ కేసుల గురించి మాట్లాడుతున్నారు. భయపడబోమని చెబుతున్నారు.
ఏమీ లేకపోతే.. కేసుల గురించి కేసీఆర్ ఎందుకు ఆందోళన చెందుతారని అంటున్నారు. నిలదీస్తామని ఢిల్లీకి వెళ్లి కొన్ని రహస్య సమావేశాలు పూర్తి చేసుకుని ఎందుకు తిరిగి వచ్చారని అంటున్నారు. మొత్తంగా చూస్తే ఢిల్లీలో ఎవరికీ తెలియని రాజకీయం జరుగుతోందన్న అభిప్రాయం మాత్రం ఎక్కువ మందిలో వినిపిస్తోంది.